Chandipura Virus: ప్రస్తుతం గుజరాత్‌లో చండీపురా వైరస్ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రమాదకరమైన వైరస్ బారిన పడి 22 మంది చిన్నారులు ఇప్పటికే మృతి చెందారు. దీంతో గుజరాత్ ప్రభుత్వం అక్కడ హై అలర్ట్ ప్రకటించింది. ఎక్కువగా 15 ఏళ్ల లోపు పిల్లలపైనే ఈ వైరస్ దాడి చేస్తుండటంతో వెంటనే పిల్లల ఆరోగ్యంపై ఫోకస్ చేసింది.

ఈ వైరస్ పేరు వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ,..ఇది భారతదేశంలో పాత వైరసే. 1965లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాకు చెందిన చండీపురా అనే గ్రామంలో ఈ వైరస్‌ను సైంటిస్టులు తొలిసారిగా గుర్తించారు. అందుకే ఆ గ్రామం పేరు మీదుగానే దీనికి చండీపురా వైరస్ అని పెట్టారు. ఆ తర్వాత 2003-, 2004, 2006 సమయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఈ వైరస్ తీవ్రంగా విజృంభించి వందలాది మంది చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది.

Also Read : Ravi Prakash Analysis:15 ఏళ్ల పిల్ల Vs 75 ఏళ్ల పీఎం

ఎలా వ్యాపిస్తుంది?

చండీపురా వైరస్ ఒకరి నుంచి ఒకరికి నేరుగా తాకడం ద్వారా వ్యాపించే సంక్రమణ వ్యాధి కాదు. ఇది ప్రధానంగా కీటకాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో, మట్టి గోడల చీలికలు, పశువుల పాకలలో ఎక్కువగా పెరిగే శాండ్ ఫ్లై కుట్టడం వల్లే ఈ వైరస్ వేగంగా సోకుతుంది. వీటితో పాటు కొన్ని రకాల దోమలు, నల్ల ఈగల ద్వారా కూడా ఇది వ్యాపించే అవకాశం ఉంది. వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఈగల సంతతి పెరిగి వ్యాధి తీవ్రత మరింత ఎక్కువవుతుంది.

చండీపురా వైరస్ చాలా వేగంగా పెరిగే అత్యంత ప్రమాదకరమైన వైరస్. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వారిపైనే ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే నేరుగా కేంద్ర నాడుల వ్యవస్థ, మెదడుపై దాడి చేస్తుంది. దీనివల్ల మెదడు వాపు వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో మరణాల రేటు 50% నుండి 70% వరకు చాలా ఎక్కువగా ఉంటుంది. సకాలంలో వైద్యం అందకపోతే అవయవాలు పనిచేయకపోవడం జరిగి కేవలం 24 నుండి 48 గంటల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

ఈ వైరస్ సోకిన పిల్లల్లో తీవ్రమైన జ్వరం ఉన్నట్లుండి వస్తుంది. దీంతో పాటు వరుసగా వాంతులు కావడం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు మొదలవుతాయి. వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లడం లేదా ఫిట్స్ రావడం వంటి భయానకమైన లక్షణాలు కనిపిస్తాయి.

ప్రస్తుతానికి చండీపురా వైరస్‌ను పూర్తిగా నివారించడానికి ఎలాంటి ప్రత్యేకమైన వ్యాక్సిన్ కానీ, నిర్దిష్టమైన యాంటీవైరల్ మందులు కానీ అందుబాటులో లేవు. బాధితుల్లో కనిపించే లక్షణాలను బట్టి వైద్యులు తక్షణమే ఆసుపత్రిలోని ICUలో చేర్చి ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్ట్‌తో అత్యవసర చికిత్స అందిస్తారు. శరీరంలో నీటిశాతం తగ్గకుండా ఫ్లూయిడ్స్ అందించడం ద్వారా మాత్రమే ప్రాణాపాయం నుంచి రక్షించాల్సి ఉంటుంది.

Also Read : కర్ణాటక కేబినెట్ విస్తరణ: కాంగ్రెస్‌లో వెల్లువెత్తిన అసమ్మతి జ్వాలలు.. ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం

జాగ్రత్తలు

ఈ ప్రమాదకర వైరస్ నుంచి పిల్లలను కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మట్టి ఇళ్లు, గోడలలో ఉండే చీలికలను పూడ్చివేయాలి. గ్రామాల్లో, పశువుల పాకల వద్ద కీటకాలను అరికట్టడానికి మలాథియాన్ పౌడర్ లేదా క్రిమిసంహారక మందులను క్రమం తప్పకుండా పిచికారీ చేయాలి. పిల్లలకు శరీరం నిండా కప్పే దుస్తులు తొడగడం, రాత్రి వేళల్లో దోమతెరలు, దోమల నివారణ లేపనాలు వాడటం వల్ల ఈగలు, దోమల కాటు నుంచి కాపాడుకోవచ్చు.