
Wanted Terrorists: మరో మూడు రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్న వేళ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ మద్దతుతో ఉగ్రవాదులు సరిహద్దుల వద్ద గానీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో గానీ దాడులకు పాల్పడవచ్చన్న సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు పాకిస్థాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, భద్రతా సంస్థలు భారీ స్థాయిలో నిఘా పెంచాయి. ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ నగరంలోని పలు ప్రముఖ ప్రాంతాల్లో 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు, వివరాలతో పోస్టర్లను ఏర్పాటు చేసింది. ఈ పోస్టర్లలో ఇండియన్ ముజాహిదీన్, అల్‌ఖైదా, వివిధ ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు, ఫొటోలు, గుర్తింపు వివరాలను ఉంచారు. అనుమానితుల ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను అధికారులు సూచించారు.
ఆగస్టు 15న ఇండిపెండెంట్స్ డే సందర్భంగా ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ వంటి ప్రాంతాల్లో భద్రతా బలగాల దృష్టి వేడుకలపై కేంద్రీకృతమై ఉంటుందని, ఇదే అదనుగా దాడులకు పాల్పడాలని ఐఎస్ఐ భావిస్తున్నదని‘ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)’అనుమానం వ్యక్తం చేస్తోంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని బలూచిస్థాన్‌లో నెలకొన్న అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఐఎస్ఐ మనదేశంలో కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ‘ఆపరేషన్ అలర్ట్’ ను ప్రకటించింది. ఆగస్టు 10 నుంచి 17 వరకు కొనసాగే ఈ ఆపరేషన్‌ను బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు, సరిహద్దు వద్ద నిఘా, పెట్రోలింగ్‌ను గణనీయంగా పెంచారు. మరోవైపు బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రతను పటిష్టం చేసేందుకు పశ్చిమబెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల్లో సుమారు 40 ‘సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)’ యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఎర్రకోట చుట్టూ కట్టుదిట్టమైన బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆగస్టు 15న ఢిల్లీలో 20 వేల మంది భద్రతా సిబ్బంది మోహరించనున్నారు.ఎర్రకోట పరిసరాల్లో వెయ్యి సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నారు.3 కిలోమీటర్ల పరిధిలో ప్రతి కదలికపై పోలీసుల కన్ను ఉండేలా చర్యలు చేపట్టారు.ఎత్తైన భవనాలపై స్నైపర్లు.. గాల్లో యాంటీ డ్రోన్ నిఘా ఉండనుంది.అనుమానితుల గుర్తింపునకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.క్రౌడ్‌లోనూ అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా ఎర్రకోట చుట్టూ గాలిపటాలు, డ్రోన్లపై కఠిన ఆంక్షలు విధించారు.మెట్రో, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఢిల్లీని జల్లెడ పడుతున్నాయి.
కాగా, భద్రతా దళాలు విడుదల చేసిన పోస్టర్లలో ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన రియాజ్ భత్కల్, షబాంద్రి మహ్మద్ ఇక్బాల్ అలియాస్ ఇక్బాల్ భత్కల్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. ఇంకా అల్‌ఖైదాతో సంబంధం ఉన్న మొహమ్మద్ షర్జీల్ అక్తర్, అబు సుఫియాన్, సయ్యద్ మొహమ్మద్ అర్షియాన్ కూడా పోస్టర్లలో ముద్రించారు. ఖలిస్థానీ ఉగ్రవాదుల్లో ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్కు చెందిన రంజిత్ సింగ్ అలియాస్ నీటా, పరమ్‌జిత్ సింగ్ పమ్మా, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్కు చెందిన అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా తదితరుల చిత్రాలు ఇందులో ఉన్నాయి. అలాగే, బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ (BKI)తో సంబంధం ఉన్న హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండా, వధావా సింగ్ బబ్బర్, గుర్మీత్ సింగ్ బగ్గ పేర్లు కూడా జాబితాలో చేర్చారు.









