
INDIA Bloc : ప్రతిపక్షాల INDIA కూటమి పార్టీలు సెప్టెంబర్ 30న ఢిల్లీలో సమావేశం కానున్నాయి. ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ఉన్న ఆందోళనలతో పాటు మరికొన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ కూడా సమావేశానికి హాజరుకానున్నారు.
ఎన్నికల సంఘం విషయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య ఇటీవల సమన్వయం పెరిగింది. SIR ప్రక్రియకు సంబంధించిన కొన్ని అంశాలపై ఎన్నికల సంఘంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు వార్తలు రావడంతో.. దీనిపై ఉమ్మడిగా ఎలా స్పందించాలనే దానిపై ప్రతిపక్ష పార్టీలు ఒకరితో ఒకరు చర్చలు జరుపుతున్నాయి. సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ పార్టీలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, SIR ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ కూడా జ్ఞానేశ్ కుమార్‌పై తన విమర్శలను మరింత పెంచింది. ఈ అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సెప్టెంబర్ 29న సమావేశం కానుంది. సెప్టెంబర్ 30న జరిగే ప్రతిపక్ష కూటమి సమావేశానికి ఒక రోజు ముందే ఈ భేటీ జరగనుంది. SIR, ఎన్నికల సంఘం అంశంపై కాంగ్రెస్ అనుసరించాల్సిన వైఖరిపై ఇందులో చర్చించే అవకాశం ఉంది.
Also Read : నగలు, నగదుతో వీడియో…. ఉన్నదంతా ఊడ్చుకెళ్లిన దొంగలు
పశ్చిమ బెంగాల్లో రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం కూడా ఈ విషయంలో కలిసి పనిచేయడం ఇప్పుడు ప్రత్యేకంగా మారింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ INDIA కూటమి, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలకు లేఖ రాసి తాజా పరిణామాలపై చర్చించేందుకు సమావేశం పెట్టాలని కోరారు. ఆ తర్వాత ఆయన మమతా బెనర్జీతో మాట్లాడగా.. పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె అంగీకరించినట్లు సమాచారం.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు మరోసారి పార్లమెంట్లో నోటీసు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. న్యాయ నిపుణులు పరిశీలించిన తర్వాత ఈ నోటీసును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. సీఈసీని తొలగించే ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడం ఇది మూడోసారి అవుతుంది.
ఎన్నికల సంఘంలో అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటూ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనం తర్వాత ప్రతిపక్షాల తాజా కదలికలు మరింత వేగం పుంజుకున్నాయి. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. SIRకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు, ఆదేశాలపై పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం తమలో భిన్న అభిప్రాయాలు, సూచనలు ఉండటం సాధారణమేనని తెలిపింది. ఇవి సంస్థలో జరిగే సాధారణ చర్చల్లో భాగమేనని పేర్కొంది. తాము తీసుకున్న ఆదేశాలకు పూర్తి చట్టబద్ధత ఉందని, చట్టంలో ఉన్న విధానాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Also Read : బ్రహ్మోస్ క్షిపణులతో.. పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు: అమిత్ షా









