
అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అరుణాచల్‌లోని టాక్సింగ్ సెక్టార్ వద్ద ఉన్న కొన్ని పెట్రోలింగ్ పాయింట్లను చైనా సైన్యం నిశ్శబ్దంగా ఆక్రమించుకుంటోందని అక్కడ ఉండే ‘పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్’ అనే ప్రాంతీయ పార్టీ ఆరోపించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేసింది. మన సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదానికి ప్రధాన కారణం ‘మెక్‌మహాన్ రేఖ’. 1914లో అప్పటి బ్రిటిష్ ఇండియా, టిబెట్ ప్రతినిధులు కలసి సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దు రేఖను నిర్ణయించారు. ఈ చర్చల్లో చైనా కూడా పాల్గొన్నప్పటికీ.. ఆ ఒప్పందంపై సంతకం చేయలేదు. చైనా మొదటి నుంచీ ఈ మెక్‌మహాన్ రేఖను అంగీకరించడం లేదు. అది బ్రిటిష్ వారు బలవంతంగా రుద్దిన సరిహద్దు అని వాదిస్తోంది.
1950లో చైనా బలవంతంగా టిబెట్‌ను తనలో విలీనం చేసుకుంది. అంతవరకు భారత్, టిబెట్ మధ్య ఉన్న సరిహద్దు కాస్తా.. భారత్, చైనాల ఉమ్మడి సరిహద్దుగా మారిపోయింది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ‘దక్షిణ టిబెట్’ అని పిలుస్తూ.. అందులోని సుమారు 90,000 చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని వాదిస్తోంది. కానీ భారత్ ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో విడదీయరాని భాగమని స్పష్టం చేస్తోంది. ఈ సరిహద్దు తగాదాల వల్లే 1962లో భారత్-చైనా మధ్య యుద్ధం కూడా జరిగింది.
యుద్ధం ముగిసినా ఇరుదేశాల మధ్య అధికారికంగా అంగీకరించిన సరిహద్దు రేఖ ఏదీ ఏర్పడలేదు. దాంతో రెండు దేశాల సైన్యాలు తాము అనుకున్న సరిహద్దుల వరకు గస్తీ తిరుగుతుంటాయి. ఈ సరిహద్దునే ‘వాస్తవ నియంత్రణ రేఖ’ అంటారు. పక్కాగా సరిహద్దు గుర్తింపు లేకపోవడం వల్లే రెండు దేశాల సైనికులు తరచూ ముఖాముఖి ఎదురవ్వడం, ఘర్షణలకు దిగడం జరుగుతోంది.
PPA పార్టీకి చెందిన ఒక బృందం జూలై 2026లో టాక్సింగ్ సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించి ఓ నివేదిక తయారుచేసింది. 2023లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన షేరా 5 పాయింట్ వద్ద భారత సైనిక ఉనికి తగ్గిందని.. ఆ ఖాళీని ఆసరాగా చేసుకుని చైనా సైనికులు ముందుకు వచ్చారని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా చైనా బలగాలు శీతాకాలంలో కూడా ఉండేలా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకున్నాయని ఈ ఆక్రమణల వల్ల స్థానిక గిరిజనులు తమ పశువులను మేపుకునే ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారని వెల్లడించింది.
సరిహద్దుల్లో భారత సైనిక బలగాన్ని, రోడ్లు, హెలిప్యాడ్లు, నెట్వర్క్ వంటి మౌలిక వసతులను వేగంగా పెంచాలని PPA కోరింది. అయితే ఈ నివేదికపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. సరిహద్దుల్లో భారత సైన్యం, ఐటీబీపీ బలగాలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయని, చైనా ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా అరుణాచల్‌లోని ప్రాంతాల పేర్లు మార్చాలని చూసినా భారత్ గట్టిగానే బుద్ధి చెప్పింది.









