
BRICS Summit 2026 India : ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాల్లో కీలకమైన బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సమ్మిట్-2026 జరగనుంది. దీనికోసం ఇప్పటికే ఆయా దేశాలకు ఆహ్వానం చేరింది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. సెప్టెంబరు 12-13 తేదీలలో జరగనున్నఈ సమ్మిట్‌లో సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు, ఇతర దేశాల నుంచి ఆహ్వానితులైన దేశాధినేతలు, విదేశీ ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల అధినేతలు, ముఖ్య ప్రముఖులు పాల్గొననున్నారు.
ఈ భేటీకి మిగిలిన దేశాల కంటే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రావడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఇద్దరు నేతలు వస్తే ఈ కూటమిలో భాగస్వామ్య దేశాల్లో అగ్రదేశాలుగా ఉన్న రష్యా, చైనా, భారత్ భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. వారిద్దరూ వస్తే వారితో ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. సదస్సు ప్రారంభమయ్యే మొదటి రోజే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ ధ్వైపాక్షిక సమావేశం అవుతారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
భారత్ అధ్యక్షతన జరగనున్న ఈ బ్రిక్స్ సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే నాలుగు అంశాల అజెండాగా జరగనుందని ఇదివరకే ప్రకటించారు. దీంతో పాటు అజెండాలో వాతావరణ మార్పులు కూడా ఉన్నాయి. అలాగే ఇంధన పరివర్తన, వాతావరణ స్థితిస్థాపకత, కీలక ఖనిజాలు, వాతావరణ ఆర్థిక సహాయంపై జరిగే చర్చలలో గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను కేంద్ర స్థానంలో ప్రస్తావించాలని భారత్ భావిస్తోంది.
కాగా ఈసారి బ్రిక్స్ సమావేశం ‘బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టెయినబిలిటీ’ అనే థీమ్‌తో జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు అయ్యే అవకాశాలున్నాయి. ఆయన సెప్టెంబరు 12న భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. పుతిన్ భారత్‌లో 2025 డిసెంబరులోనే పర్యటించారు. ఏడాదిలోపే మరోసారి ఇండియా టూర్‌కు ఆయన రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్టు 31న బిష్కెక్లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో మోదీ, పుతిన్ కలుసుకున్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ స్వయంగా పుతిన్‌ను ఆహ్వానించారు. చైనా అధ్యక్షుడు కూడా తొలిరోజునే ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీ జరపనున్నట్లు తెలుస్తోంది. జిన్పింగ్ఆఖరిసారిగా 2019లో భారత్‌లో పర్యటించారు. గడచిన ఏడేళ్లలో జిన్‌పింగ్ ఇంతవరకు భారత్ కు రాలేదు.
Also Read : ముంచుకొస్తున్న ముప్పు.. మళ్లీ డేంజర్లో నేపాల్
ప్రస్తుతం బ్రిక్స్‌లో 11 శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి అవి
1. బ్రెజిల్ ,2. రష్యా ,3. భారత్, 4. చైనా, 5. దక్షిణాఫ్రికా, 6. ఈజిప్ట్, 7. ఇథియోపియా, 8. ఇండోనేషియా, 9. ఇరాన్, 10. సౌదీ అరేబియా,11. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కాగా వీటిలో ఇండోనేషియా 2025 జనవరిలో బ్రిక్స్ పూర్తి సభ్యదేశంగా చేరగా. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈలు పూర్తి సభ్యులుగా చేరాయి. 2025లో ఇండోనేషియా సభ్యత్వం తీసుకుంది.
బ్రిక్స్ భాగస్వామ్య దేశాలివే..
శాశ్వత సభ్యత్వంతో పాటు బ్రిక్స్‌లో పార్ట్నర్ కంట్రీస్ అనే ప్రత్యేక గ్రూపు కూడా ఉంది.వాటిని భాగస్వామ్య దేశాలుగా పేర్కొంటారు. వాటిలో బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం తదితర దేశాలు ఉన్నాయి. ఈ దేశాలను అవసరాన్ని బట్టి మాత్రమే బ్రిక్స్ సమావేశాలకు ఆహ్వానిస్తారు. బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పుడు ఇతర సమావేశాల్లో కూడా భాగస్వామ్య దేశాలు పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
సదస్సులో పాల్గొనే నాయకులు..
బ్రిక్స్ సమ్మిట్‌కు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్-సీసీ, ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం,కజకిస్థాన్ అధ్యక్షుడు కాస్సిమ్ జోమార్ట్ టోకాయెవ్, థాయ్‌లాండ్ ప్రధాని అనుటిన్ చార్న్విరాకుల్ తదితరులు పాల్గోననున్నారు. అలాగే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఆ అంశాలే అజెండాగా…
బ్రిక్స్ సమ్మిట్‌లో ఆతిథ్య దేశంగా ఉన్న భారత్ ప్రధానంగా ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించే అవకాశం ఉంది. సభ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలను తగ్గించడంపై దృష్టి పెట్టనుంది. ప్రపంచ వాణిజ్యంలో ఎదురవుతున్న భౌగోళిక, రాజకీయ సవాళ్ల నేపథ్యంలో సరఫరా చైన్‌ను మరింత పటిష్ఠం చేయడం భారత్ అజెండాలో ముఖ్యమైన అంశంగా ఉండనుంది. ఈ బ్రిక్స్ సమావేంలో కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం కాకుండా వాణిజ్యం, టెక్నాలజీ, ఇంధనం, ఆరోగ్యం, వ్యవసాయం, వాతావరణం వంటి రంగాలపై కూడా చర్చించనున్నారు.
Also Read : పిల్లల్ని కనండి.. ఖర్చులన్నీ మేమే చూసుకుంటాం.. చైనా సంచలన ప్రకటన!
బ్రిక్స్ సమ్మిట్-2026 షెడ్యూల్ ఇదే..!
సెప్టెంబర్ 12న బ్రిక్స్ సభ్య దేశాల నాయకుల రాకతో సదస్సు ప్రారంభం కానుంది.
మధ్యాహ్నం 2:00 గంటలకు: భారత్ మండపం లెవెల్-2కు బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చేరుకుంటారు. అనంతరం అధికారిక ఫొటో కార్యక్రమం ఉండనుంది
మధ్యాహ్నం 2:35 గంటలకు: సమ్మిట్ హాల్లో బ్రిక్స్ సభ్య దేశాల నాయకుల అంతరంగిక సమావేశం ఉంటుంది. “సమ్మిళిత ప్రపంచ పాలన – బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం” అనే అంశంపై ఈ సమావేశం నిర్వహిస్తారు.
సాయంత్రం 4:25 గంటలకు: నాయకులు భారత్ మండపంలోని హాల్-14లో ఏర్పాటు చేసిన “భారత్ ఇన్నోవేట్స్ ఎగ్జిబిషన్”ను సందర్శించనున్నారు. భారతదేశ సాంకేతిక, ఆవిష్కరణ సామర్థ్యాలను ప్రపంచ నాయకులకు పరిచయం చేయడం ఈ ప్రదర్శన ఉద్ధేశం.
సాయంత్రం 5:05 గంటలకు: భారత్ మండపం బయటి పచ్చిక బయళ్లలో బ్రిక్స్ సభ్య దేశాల నాయకుల కుటుంబ ఫోటో సెషన్ కార్యక్రమం నిర్వహిస్తారు.
సాయంత్రం 5:10 గంటలకు: సభ్య దేశాల నాయకులంతా ఉమ్మడి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నారు.
సాయంత్రం 7:30 గంటలకు: భారత్ మండపం మూడో అంతస్తులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అతిథులకు విందు ఏర్పాటు చేస్తారు.
సెప్టెంబర్ 13.. భాగస్వామ్య దేశాల నేతల రాక
రెండో రోజు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల ప్రభుత్వాధినేతలు, దేశాధినేతలు, ఆహ్వానితుల రాకతో రెండవ రోజు సమావేశం ప్రారంభమవుతుంది.
ఉదయం 9:55 గంటలకు: భారత్ మండపం లెవెల్-2కు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నాయకులు, ప్రత్యేక ఆహ్వానితులు చేరుకుంటారు.
ఉదయం 10:35 గంటలకు: రెండో అంతస్తులో ఫోటో సెషన్ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఉదయం 10:50 గంటలకు: సమ్మిట్ హాల్లో ప్రధాన బహిరంగ సమావేశం మొదలవుతుంది. “స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం – సుస్థిరత: సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం” అనే అంశంపై నాయకుల మద్య చర్చ కార్యక్రమం ఉంటుంది.
ఈ సమావేశం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు, సాంకేతిక ఆవిష్కరణలు, వాతావరణ మార్పులు, సుస్థిరత, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై బ్రిక్స్ దేశాల వైఖరి వెల్లడించనున్నారు.
2026 సమ్మిట్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఎందుకంటే ?
బ్రిక్స్ ఏర్పాటై 2026తో రెండు దశాబ్దాలు పూర్తవుతున్నాయి. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా దేశాల భాగస్వామ్యంతో BRICగా ప్రారంభమైన ఈ వేదికలో 2010లో దక్షిణాఫ్రికా చేరింది. దీంతో BRICSగా మారింది. తొలి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలోని యెకటెరిన్‌బర్గ్‌లో నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల వాటా గణనీయంగా పెరిగింది. అందువల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించేందుకు ఈ కూటమి ఒక ముఖ్యమైన వేదికగా ఉండనుంది.









