Chicken Neck: పశ్చిమ బెంగాల్‌లో ఉన్న చికెన్ నెక్ చూడటానికి కోడి మెడలా ఉంటుంది. భూభాగం చిన్నగా కోడి మెడలా ఉండటంతో దీనికి ఆ పేరు పెట్టారు. అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి అస్సాం, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాలకు సైనిక దళాలు, నిత్యావసర సరుకులు, ఇంధనం, మందులు రవాణా చేయాలంటే ఈ ఒక్క చిన్న మార్గమే దిక్కు. ఈ దారిని మూసి వేసి భారత్ నుంచి శాశ్వతంగా వేరు చేయాలని చైనా, పాకిస్తాన్ దేశాలు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్ ‘కలదాన్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్’తో వారి ప్లాన్‌ను తిప్పికొట్టింది. అసలు ఈ కలదాన్ ప్రాజెక్ట్ ఏంటంటే?

కలదాన్ ప్రాజెక్ట్ అనేది సముద్రం, నది, రహదారి మార్గాలతో రూపొందించిన ఒక రవాణా వ్యవస్థ. అయితే ఈ ప్రాజెక్టు మూడు దశల్లో పనిచేస్తుంది. ఫస్ట్ కోల్‌కతా పోర్టు నుంచి మయన్మార్‌లోని ‘సిట్వే’ పోర్ట్‌కు దాదాపు 539 కిలోమీటర్ల దూరం పెద్ద పెద్ద సరుకు రవాణా ఓడల ద్వారా వెళ్తుంది. ఆ తర్వాత సిట్వే పోర్ట్ నుంచి మయన్మార్ లోపల ఉన్న ‘పాలెట్వా’ వరకు కలదాన్ నది గుండా 158 కిలోమీటర్ల మేర పడవల ద్వారా సరుకులను చేరవేస్తారు. ఇక చివరిగా పాలెట్వా నుంచి భారత సరిహద్దు రాష్ట్రమైన మిజోరాంలోని జోరిన్‌పుయి వరకు నిర్మించే 110 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి ద్వారా సరుకులు ఇండియాలోకి చేరుకుంటాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కోల్‌కతా నుంచి మిజోరాం చేరడానికి ప్రయాణ దూరం ఏకంగా 1,000 కిలోమీటర్లు తగ్గిపోతుంది. గతంలో గౌహతి ద్వారా చికెన్ నెక్ దాటుకుంటూ మిజోరాం వెళ్లడానికి పట్టిన వారం రోజుల సమయం పట్టేది. కానీ ఇకపై కేవలం రెండు నుంచి మూడు రోజుల్లోనే పూర్తవుతుంది.

మయన్మార్, బంగాళాఖాత ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ కింద మయన్మార్‌లోని క్యాక్‌ప్యూ వద్ద ఓడరేవును నిర్మించింది. అయితే చైనా ఓడరేవుకు దగ్గరలోనే సిట్వే పోర్టును భారత్ సొంతంగా నిర్మించడం ప్రారంభించింది. దీంతో ఆసియాలో చైనా అల్లుకున్న “ముత్యాల హారం” ప్లాన్ పూర్తిగా బద్దలైంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఆగ్నేయాసియా దేశాలలో చైనా సైనిక, ఆర్థిక ప్రభావం బాగా తగ్గిపోతుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి కాకుండా చైనా వెనుక ఉండి కుట్రలు చేస్తోంది.

2021లో మయన్మార్‌లో సైనిక పాలన వచ్చినప్పటి నుంచి ‘అరకాన్ ఆర్మీ’ అనే తిరుగుబాటు బృందానికి చైనా రహస్యంగా ఆయుధాలు, నిధులు అందిస్తోంది. భారత్ రోడ్డు పనులు చేపట్టిన ప్రతిసారీ ఈ తిరుగుబాటుదారులు భారతీయ ఇంజనీర్లపై దాడులు చేస్తూ ప్రాజెక్ట్‌ను ఆలస్యం చేస్తున్నారు. ఇలా ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా భారత్ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ‘సిట్వే’ పోర్టును విజయవంతంగా భారత్ నిర్మించింది. ఇంకా మిగిలిన రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మయన్మార్ సైనిక ప్రభుత్వంతో పాటు స్థానిక సమూహాలతో కూడా దౌత్యపరమైన చర్చలు జరుపుతోంది.