భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో పినాకా మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. దేశంలో తయారైన ఆయుధ సంపత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ కూడా పెరుగుతోంది. బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల భారీ విజయం తర్వాత ఇప్పుడు భారత పినాకా రాకెట్ వ్యవస్థను కొనుగోలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. భారత్‌తో మిత్రంగా ఉన్న దేశాలకు ఆయుధాలు ఎగుమతి చేసే విధానంలో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఓ కీలకమైన నిర్ణయం తీసుకోనుంది.

Also Read : పరీక్ష పేపర్ లీకేజీలకు చెక్.. లోక్‌సభలో సవరణ బిల్లు.. అందులో ఏమున్నాయంటే?

ఈ పినాకా రాకెట్ సిస్టమ్‌ను తమ సైన్యంలో చేర్చుకోవడానికి ఆసియా దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ ప్రస్తుతం రేసులో ముందంజలో ఉన్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయగా.. ఇండోనేషియా కూడా బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. భారత్‌కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఈ పినాకా వ్యవస్థకు రూపకల్పన చేయగా.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), లార్సెన్ అండ్ టూబ్రో (L&T) వంటి ప్రముఖ దేశీయ కంపెనీలు వీటిని భాగస్వామ్యంతో తయారు చేశాయి. ఇది ఇప్పటికే భారత సైన్యంలో చేరింది. అలాగే సేవలు కూడా అందిస్తోంది.

పినాకా రాకెట్ సిస్టమ్ కేవలం 44 సెకన్ల వ్యవధిలోనే వరుసగా 12 రాకెట్లను శత్రు స్థావరాలపైకి గురితప్పకుండా ప్రయోగించగలదు. దీని ప్రాథమిక వెర్షన్ దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేస్తుంది. ఆధునిక జీపీఎస్ (GPS), ఇన్సార్షియల్ నావిగేషన్ పరిజ్ఞానంతో పనిచేయడం వల్ల ఇది అనుకున్న లక్ష్యాన్ని చేరుతుంది. అంతేకాకుండా రాకెట్లను ప్రయోగించిన వెంటనే ఈ లాంచర్ వాహనం తన స్థానాన్ని వేగంగా మార్చుకోగలదు. తద్వారా శత్రువులు తిరిగి ఎదురుదాడి చేసే అవకాశమే ఉండదు. శత్రువుల బంకర్లు, సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలను నాశనం చేయడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది.

మరోవైపు పినాకాతో పాటు భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసే దేశాల జాబితా కూడా రోజురోజుకూ పెద్దదవుతోంది. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియాతో పాటు యూఏఈ (UAE) కూడా బ్రహ్మోస్ కొనుగోలుపై తీవ్ర ఆసక్తి కనబరుస్తుండటం విశేషం. వియత్నాం, ఫిలిప్పీన్స్ తర్వాత ఇండోనేషియా మూడో అతిపెద్ద కొనుగోలుదారుగా మారబోతోంది.

Also Read : ఊరమాస్ ఒప్పో ఫోన్: 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో ఫీచర్లు హైలైట్..!