
సోషల్ మీడియా ప్రపంచంలో అగ్రగామిగా వెలుగుతున్న మెటా సంస్థ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్(Instagram) వీడియో ప్లాట్‌ఫామ్ దిగ్గజం యూట్యూబ్‌కు నేరుగా సవాల్ విసిరేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. ఇప్పటివరకు కేవలం పొట్టి వీడియోలు, క్రేజీ రీల్స్‌కు మాత్రమే కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఇన్‌స్టాగ్రామ్.. ఇప్పుడు తన పరిధిని విస్తరిస్తూ సుదీర్ఘమైన లాంగ్ వీడియోలపైనా దృష్టి సారించింది. యూజర్లు ఇకపై ఏకంగా 90 నిమిషాల వ్యవధి గల హరిజాంటల్ వీడియోలను కూడా అప్‌లోడ్ చేసుకునేలా సరికొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోందని ప్రకటించి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.
Also Read : ఎల్‌నినో ఎఫెక్ట్.. ముంచుకొస్తున్న ప్రాణాంతక ఆరోగ్య ముప్పులు.. తప్పనిసరి తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
యూట్యూబ్‌లో లభించే పాడ్‌కాస్ట్‌లు, వినోదాత్మక షోలు, స్టాండప్ కామెడీలు, వివరణాత్మక కంటెంట్‌ను తమ ప్లాట్‌ఫామ్ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ఇన్‌స్టా ఈ నిర్ణయం తీసుకుంది. పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్లను, డిజిటల్ పాడ్‌కాస్టర్లను ఆకట్టుకునేందుకు ఈ కొత్త వెసులుబాటును అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బ్రెజిల్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండగా.. తాజాగా అమెరికా వంటి ప్రధాన మార్కెట్‌కు కూడా విస్తరించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఈ ఫీచర్ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ లభించనుంది.
ఈ ఫీచర్ ద్వారా మొబైల్ యాప్‌లో క్రియేటర్లకు ఒక అద్భుతమైన అవకాశం లభించనుంది. క్రియేటర్లు తమ 90 నిమిషాల పూర్తి వీడియోను ప్రమోట్ చేయడానికి ఒక చిన్న రీల్‌ను వాడుకోవచ్చు. యూజర్లు ఆ రీల్ చూస్తున్నప్పుడు ‘ఫుల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే పూర్తి నిడివి గల సుదీర్ఘ వీడియో నేరుగా ప్లే అవుతుంది. దీనివల్ల క్రియేటర్లకు తమ కంటెంట్‌ను ఎక్కువ మందికి చేరువ చేయడ, వీక్షకులను సులభంగా ఆకర్షించడం చాలా తేలికవుతుంది.
మెటా గతంలోనే ‘ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ’ అనే ప్రత్యేకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. స్మార్ట్ టీవీల్లో ఇన్‌స్టాగ్రామ్ వీక్షకుల సంఖ్యను విపరీతంగా పెంచాలనే ప్రతిష్టాత్మక ప్రణాళికలో భాగంగానే ఈ 90 నిమిషాల వీడియోల ఫీచర్‌ను రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఫోన్‌ల నుంచి నేరుగా స్మార్ట్ టీవీ స్క్రీన్‌లకు తమ కంటెంట్‌ను విస్తరించడం ద్వారా యూట్యూబ్‌తో పాటు ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కూడా ఇన్‌స్టా గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది.
Also Read : అందుకు రాజీనామా తప్పు కాదు.. MLAల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు









