Karnataka :  యూఏఈలోని షార్జాలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఉడుపి జిల్లాకు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్ జులైలో హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది. ఆయన మృతదేహం తొమ్మిది ముక్కలుగా ఉండటం కలకలం రేపింది. ఈ విషయం దాదాపు రెండు నెలల తర్వాత బయటకు వచ్చింది. ప్రకాశ్ మృతదేహాన్ని ఒమన్ వైపు వెళ్లే మార్గంలో ఓ కారులో గుర్తించినట్లు సమాచారం. ఆయన మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా చేసి రెండు బ్యాగుల్లో పెట్టినట్లు ఆయన సోదరుడు అనిల్ ప్రశాంత్ కుందర్ తెలిపారు. ప్రకాశ్ షార్జా ఎయిర్‌పోర్టులో దాదాపు 14 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన భార్య టీనా కుందర్ కూడా ఉడుపికి చెందినవారే. ఆమె ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు పదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు.

Also Read : షార్జాలో దారుణం! భారతీయుడిని చంపి..9 ముక్కలుగా చేసి..భార్య,పిల్లలు మిస్సింగ్?

జులై 20 ప్రాంతంలో ప్రకాశ్‌కు ఆయన సోదరుడు అనిల్ ఫోన్ చేశారు. అయితే ప్రకాశ్ ఫోన్ ఎత్తలేదు. కొంతసేపటి తర్వాత తాను బాగానే ఉన్నానని మెసేజ్ పంపారు. అయితే సాధారణంగా ప్రకాశ్ వాయిస్ మెసేజ్‌లు పంపుతుండటంతో ఈ మెసేజ్ కుటుంబ సభ్యులకు అనుమానం కలిగించింది. ఆ తర్వాత కూడా ప్రకాశ్‌కు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన అనిల్ షార్జాలో ఉన్న ప్రకాశ్ స్నేహితుడు మనోహర్‌కు ఫోన్ చేసి, ప్రకాశ్ గురించి తెలుసుకోవాలని కోరారు. మనోహర్ ప్రకాశ్ ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా, అక్కడి వాచ్‌మన్ ప్రకాశ్ ఇండియాకు వెళ్లారని చెప్పాడు. కంపెనీ సిబ్బంది కూడా మొదట ప్రకాశ్ ఇండియాకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. అయితే ప్రకాశ్ ఇండియాకు రాలేదని అనిల్ కంపెనీకి చెప్పారు. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని కోరారు. తర్వాత పాస్‌పోర్ట్ వివరాలను పరిశీలించగా ప్రకాశ్ ఇంకా షార్జాలోనే ఉన్నట్లు తెలిసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ప్రకాశ్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ప్రకాశ్ కోసం వెతుకుతున్న సమయంలో ఒమన్ వైపు వెళ్లే మార్గంలో ఓ కారులో ఆయన మృతదేహం లభించింది. మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా చేసి రెండు బ్యాగుల్లో పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తర్వాత ఆ మృతదేహం ప్రకాశ్‌దేనని గుర్తించారు. ప్రకాశ్ హత్య తర్వాత ఆయన భార్య టీనా, వారి కుమారుడు కూడా కనిపించకుండా పోయారు. దీంతో ఈ హత్యతో టీనాకు ఏమైనా సంబంధం ఉందా అనే విషయంలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆమె పాత్రపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ప్రకాశ్ కుటుంబ సభ్యులు కూడా భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నట్లు తమకు తెలియదని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ స్టార్ పేసర్ రిటైర్మెంట్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.