Rajya Sabha :  పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ చేసిన లుంగీవాలా కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేరళకు చెందిన సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్‌ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయడంతో దక్షిణాది ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా బుధవారం పార్లమెంట్‌లోని మకర ద్వార్ వద్ద చేతిలో ప్లకార్డులు పట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు.

ఈ వ్యవహారం రాజ్యసభలోనూ తీవ్ర గందరగోళానికి దారితీసింది. తనను అవమానించిన బీజేపీ ఎంపీపై కేరళ ఎంపీ జాన్ బ్రిటాస్ రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. కాగా, ఈ అంశంపై ఇరు వర్గాల వాదనలు వినేందుకు లోక్‌సభ స్పీకర్ కూడా సమావేశానికి పిలిచారు.

ఇంతకు ఏం జరిగిందంటే.. సోమవారం పన్నుల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ తన ప్రసంగానికి పదే పదే అడ్డంకి కలిగిస్తున్నారని జాన్ బ్రిటాస్ ఆరోపించారు. ఆమె వెనుక సీటులోకి వచ్చి ఇబ్బంది పెడుతుండటంతో, ఇది మీ సీటు కాదు, ఇక్కడ కూర్చోవద్దు అని కోరినట్లు ఆయన తెలిపారు. దీంతో కోపంతో ఆమె తనను పదే పదే లుంగీవాలా, లుంగీవాలా అని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. భాష, ప్రాంతం, సాంప్రదాయ దుస్తుల ఆధారంగా సభలో ఎవరినీ చులకన చేయకూడదని ఆయన అన్నారు.

Also Read : మహిళా బిల్లుకు ఒకే…డీలిమిటేషన్ కు నో….తమిళనాడు అసెంబ్లీ కీలక తీర్మానం

ఈ వ్యాఖ్యలపై ఎంపీ జాన్ బ్రిటాస్ మాట్లాడుతూ.. లుంగీ అనేది లక్షలాది మంది ప్రజల, ముఖ్యంగా దక్షిణాది వారి సాంప్రదాయ వస్త్రధారణ అని పేర్కొన్నారు. ఈ పదాన్ని గతంలో కూడా దక్షిణాది వారిని గేలి చేయడానికి వాడారని గుర్తుచేశారు. 1960, 1970ల కాలంలో ముంబైలో దక్షిణాది వారికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో లుంగీవాలా, మద్రాసీ అనే పదాలను హేళనగా ఉపయోగించేవారని, ఇప్పుడు పార్లమెంట్‌లోనూ అలాంటి సంస్కృతిని తీసుకురావడం విచారకరమని అన్నారు.

Also Read : రాజ్యసభలో లుంగీవాలా రచ్చ: దక్షిణాది ఎంపీల తీవ్ర నిరసన!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.