Second-Hand Smoke Deaths
Second-Hand Smoke Deaths

మీకు సిగరెట్ అలవాటు లేదా? జీవితంలో బీడీ ముక్క కూడా ముట్టుకోలేదా? ‘నేను చాలా హెల్దీ… నా లంగ్స్ సేఫ్’ అని హ్యాపీగా ఉన్నారా? అయితే ఈ నిజం వింటే మీ గుండె ఆగిపోతుంది. సిగరెట్ ముక్క ముట్టని మీరు… మీ ఇంట్లో కూర్చున్నా, బస్టాప్‌లో నిలబడినా, పక్కన ఎవడో ఊదే దమ్ము మీ ఊపిరితిత్తుల్లోకి విషంలా చేరుతోంది. వాడు నాలుగు దమ్ములు లాగి స్టైల్‌గా పొగ వదిలేసి వెళ్లిపోతాడు… కానీ ఆ విషాన్ని పీల్చి, చాపకింద నీరులా ప్రాణాలు కోల్పోతోంది ఎవరో తెలుసా? మీరు, మీ ఇంట్లోని పసిపిల్లలు, మీ భార్యాపిల్లలు. దీన్నే మెడికల్ లాంగ్వేజ్‌లో ‘సెకండ్-హ్యాండ్ స్మోక్’ అంటారు. రీసెంట్‌గా వచ్చిన లాన్సెట్ మెడికల్ జర్నల్ రిపోర్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. 2023 ఒక్క సంవత్సరంలోనే… మన ఇండియాలో ఇతరులు తాగిన పొగ పీల్చి ఎంతమంది చనిపోయారో తెలుసా? అక్షరాలా 3 లక్షల 25 వేల మంది. రోజుకు దాదాపు 900 మంది అమాయకులు బలైపోతున్నారు. సిగరెట్ తాగేవాడిది ఎంజాయ్‌‌మెంట్… కానీ ఆ పొగ పీల్చే మీది ఎక్స్‌పైరీ డేట్. అసలు ఏంటీ రహస్య మారణహోమం? మన లంగ్స్ ని ఎవరు నాశనం చేస్తున్నారో డిటైల్డ్‌గా చూద్దాం…

మనం ఏదో డౌట్‌తో మాట్లాడటం లేదు. మెడికల్ వరల్డ్‌లో బైబిల్ లాంటి ‘ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్’ జర్నల్. అందులోనే ఈ షాకింగ్ విషయాలను గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జిబిడి) రిపోర్ట్ బట్టబయలు చేసింది. మొన్న గాంధీ జయంతి నాడు ‘టొబాకో ఫ్రీ ఇండియా’ నిర్వహించిన నేషనల్ వెబినార్‌లో దేశంలోనే టాప్ హెల్త్ ఎక్స్‌పర్ట్స్ వార్నింగ్ ఇచ్చారు. నీతి ఆయోగ్ మాజీ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ బయటపెట్టిన లెక్కలు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. 1990లో మన దేశంలో పాసివ్ స్మోకింగ్‌కు గురయ్యే వారి శాతం 43% ఉండేది. 2023 నాటికి అది 31 శాతానికి తగ్గింది. పర్సంటేజ్ తగ్గింది కదా అని సంబరపడకండి… అక్కడే ఉంది అసలు ట్విస్ట్. మన దేశ జనాభా పెరగడంతో, బాధితుల సంఖ్య 37.5 కోట్ల నుంచి ఏకంగా 44 కోట్ల 40 లక్షలకు చేరింది. ప్రపంచం మొత్తం మీద పాసివ్ స్మోకింగ్ అంటే సెకండ్-హ్యాండ్ స్మోక్ వల్ల ఏడాదికి 17 లక్షల మంది చనిపోతుంటే… అందులో 3.25 లక్షల మరణాలు మన ఇండియాలోనే నమోదవుతున్నాయి. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా పరోక్ష ధూమపానానికి బలవుతున్న దేశం మన భారత్. 1990తో పోలిస్తే మన దేశంలో ఈ మరణాలు ఏకంగా 50 శాతం పెరిగాయి. అంటే 3 దశాబ్దాల్లో సమస్య తగ్గాల్సింది పోయి, డబుల్ స్పీడుతో దూసుకెళ్తోంది!

ఇక్కడ అత్యంత షాకింగ్ మేటర్ ఏంటో తెలుసా? ఈ పాసివ్ స్మోకింగ్‌కు బలవుతున్న వారిలో మెజారిటీ ఎవరంటే… ఏ పాపం ఎరుగని మహిళలు, పసిపిల్లలు. ఢిల్లీ ఎయిమ్స్ రుమటాలజీ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ డాక్టర్ ఉమా కుమార్ ఒక హార్ష్ రియాలిటీ చెప్పారు. సొసైటీలో తాము తిరిగే, నివసించే పరిసరాలపై ఎలాంటి కంట్రోల్ లేని వర్గం ఎవరంటే మహిళలు, పిల్లలే. 2023 డేటా ప్రకారం చనిపోయిన 3.25 లక్షల మందిలో 1 లక్షా 57 వేల మంది మహిళలే. భర్తో, తండ్రో, అన్నాతమ్ముడో బాల్కనీలోనో, హాల్‌లోనో కూర్చుని సిగరెట్ వెలిగిస్తే… ఆ సిగరెట్ స్మోక్ నేరుగా ఆ ఇంట్లోని మహిళలు, పిల్లల ఊపిరితిత్తుల్లోకి వెళ్తోంది. సిగరెట్ ఫిల్టర్‌తో తాగేవాడి లోపలికి వెళ్లే పొగ కంటే, సిగరెట్ చివరి నుండి గాల్లోకి వచ్చే పొగలో కార్సినోజెన్స్ (క్యాన్సర్ కారకాలు), కార్బన్ మోనాక్సైడ్, నికోటిన్ గాఢత ఇంకా ఎక్కువ ఉంటాయని సైన్స్ చెబుతోంది. పసిపిల్లల్లో నిమోనియా, బ్రాంకైటిస్, ఆస్తమా రోగాలు పెరిగిపోతున్నాయి. తప్పు ఎవడో చేస్తే… శిక్ష మాత్రం చిన్న పిల్లలకా?

చాలామందికి ఒక భ్రమ ఉంటుంది… ‘పొగ కాసేపు పీల్చితే ఏమవుతుందిలే, దగ్గు వస్తే తగ్గిపోతుంది’ అని తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఐసిఎమ్‌ఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి.ఎమ్. కటోచ్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.కె. తల్వార్ ఏం హెచ్చరిస్తున్నారంటే.. ‘‘మీరు సిగరెట్ ముక్క నోట్లో పెట్టకపోయినా, పక్కవాడు పొగ తాగుతున్న గదిలో గంటసేపు కూర్చుంటే… మీరు కూడా ఒక సిగరెట్ తాగినట్టే లెక్క.

శ్వాసకోశ వ్యవస్థ నాశనం: మీ శ్వాసనాళాల్లో ఉండే రక్షణ కవచం (సిలియా) దెబ్బతింటుంది. క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఒపిడి) స్టార్ట్ అవుతోంది.

హార్ట్ అటాక్ రిస్క్: రక్తనాళాలు బిగుసుకుపోయి, రక్తంలో గడ్డకట్టే గుణం పెరుగుతుంది. హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వచ్చే రిస్క్ విపరీతంగా పెరుగుతుంది.

క్యాన్సర్స్ అటాక్: కేవలం లంగ్ క్యాన్సర్ మాత్రమే కాదు… బ్లడ్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.’’

డాక్టర్ కటోచ్ క్లియర్‌గా చెప్పారు: ‘ఇది కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కాదు… కాలక్రమేణా శరీరంలోని ప్రతి అవయవాన్ని గుల్ల చేస్తుంది’. మన దేశం ఈ ఒక్క కారణంతో ఏటా ఏకంగా 9.28 మిలియన్ డిజెబిలిటీ-అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ కోల్పోతోంది. అంటే ప్రజలు ఆరోగ్యంగా బతకాల్సిన కోట్లాది పనిదినాలు, ఆయుష్షు బూడిదలో పోసిన పన్నీరవుతోంది.

ఇక్కడ మనం సిస్టమ్‌ని డైరెక్ట్‌‌గా క్వశ్చన్ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధిస్తూ అక్టోబర్ 2, 2008న చట్టం తెచ్చారు. ఇప్పటికి 18 ఏళ్లు పూర్తయ్యాయి. మరి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? టీ కొట్ల దగ్గర, బస్టాప్‌ల పక్కన, రెస్టారెంట్ల బయట, చివరకు ఆఫీసు గేట్ల ముందే పబ్లిక్‌గా పొగ ఊదేస్తున్నారు. అడిగే నాథుడే లేడు. పెద్ద పెద్ద హోటళ్లు, ఎయిర్‌పోర్టుల్లో డెసిగ్నేటెడ్ స్మోకింగ్ జోన్స్ అని స్పెషల్ రూమ్స్ పెట్టారు. కానీ హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారంటే… ఈ జోన్లు ఉన్నంత కాలం పొగ పూర్తిగా ఆగదు. ఎయిమ్స్ డాక్టర్ ఉమా కుమార్ డిమాండ్ చేస్తున్నది ఒక్కటే… భారతదేశం వెంటనే ‘100% స్మోక్-ఫ్రీ పబ్లిక్ ప్లేసెస్’ విధానాన్ని అమలు చేయాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం ప్రపంచంలో ఇప్పటికే 40 శాతం దేశాల్లో ఎలాంటి మినహాయింపులు లేకుండా స్ట్రిక్ట్ స్మోక్-ఫ్రీ రెగ్యులేషన్స్ అమల్లో ఉన్నాయి. మన దగ్గర కూడా ఈ స్పెషల్ రూమ్స్, ఎక్సెప్షన్స్ ఎత్తేసి, బహిరంగంగా ఎక్కడైనా పొగతాగితే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందే.

ఈ టాక్సిక్ కల్చర్ వల్ల దేశానికి జరుగుతున్న నష్టం ఎంతో తెలుసా? డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం ఇండియాలో పొగాకు సంబంధిత వ్యాధులు, మరణాల వల్ల దేశానికి ఏటా రూ.1.77 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఇది మన మొత్తం దేశ జీడిపిలో దాదాపు 1%. కేవలం సిగరెట్లు, బీడీలే కాదు… ఖైనీ, గుట్కా, జర్దా, హుక్కా రూపంలో పొగాకు మన యువతను పట్టి పీడిస్తోంది. ఏటా డైరెక్ట్‌గా 13.5 లక్షల మంది చనిపోతున్నారు. అందుకే డాక్టర్ వి.కె. పాల్ ఒక మాట అన్నారు.. ‘పాసివ్ స్మోకింగ్ తగ్గించడం మాత్రమే టార్గెట్ కాదు… భారతదేశం కాంప్లీట్‌గా టొబాకో-ఫ్రీ దేశంగా మారాలి. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో పొగాకు అన్న మాటే వినిపించకూడదు.’

చివరిగా ఒక్కటే మాట ఫ్రెండ్స్… మీరు పొగతాగే వారైతే… మీ అడిక్షన్ కోసం పక్కనున్న మీ బిడ్డను, మీ తల్లిదండ్రులను, మీ ఫ్రెండ్స్‌ను బలిచేయకండి. ఇక పొగతాగని సామాన్యులకు మనవి… మీ పక్కన ఎవడైనా దమ్ము కొడుతుంటే చూస్తూ సైలెంట్‌గా ఉండకండి. వాడికి ధైర్యంగా చెప్పండి: ‘నీ ప్రాణం తీసుకుంటావో లేదో నీ ఇష్టం… కానీ నా ప్రాణాన్ని తీసే హక్కు నీకు లేదని’. పైనున్న వీడియోను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పాటు ముఖ్యంగా సిగరెట్ తాగే ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. వాళ్ల కళ్లు తెరిపించండి.