
SIM rules : దేశంలో డిజిటల్ స్కా్మ్లను అరికట్టే ఉద్ధేశంతో టెలికాం విభాగం(DoT) సిమ్ కార్డుల జారీ నిబంధనలను కఠినతరం చేసింది. నిర్ణీత పరిమితికి మించి సిమ్ కార్డులు తీసుకున్న చందాదారులకు సంబంధించిన ఫొటోలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇక మీదట కొత్త సిమ్ కార్డులను వినియోగదారులకు ఇచ్చే ముందు గతంలోని డేటాతో సరిపోల్చుకోవాలని టెలికాం ఆపరేటర్లను టెలికాం విభాగం ఆదేశించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ విడుదల చేసింది. దేశంలో పెరిగిన పోతున్న డిజిటల్ స్కామ్‌లను అరికట్టాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం విభాగం వెల్లడించింది.
టెలికాం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి దేశంలో ఉన్న అన్ని సర్కిళ్లలో అన్ని టెలికాం విభాగాలకు సంబంధించి గరిష్ఠంగా 9 సిమ్ కార్డులను మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అంతకు మించి సిమ్ కార్డులు తీసుకునే చందాదారుల ఫొటోలను డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ (DIP)లో అప్డేట్ చేస్తామని టెలికాం విభాగం వివరించింది. ఆగస్టు 23 తేదీ నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుందని టెలికాం విభాగం తెలిపింది. ఆగస్టు 24 నుంచి టెలికాం కంపెనీలు డీఐపీ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని ఆదేశించింది.
ఇక మీదట కొత్త సిమ్ కార్డులను కస్టమర్లకు ఇచ్చే ముందు వారి ఫొటోలను ఈ డేటాతో సరిపోల్చుకోవాలని కోరింది. ఇక మీదట పరిమితి దాటిన వినియోగదారులకు కొత్త సిమ్ కార్డుల జారీ చేయడాన్ని టెలికాం విభాగం తిరస్కరించనుంది. నవంబర్ 30 నాటికి ఈ ప్రక్రియను రియల్ టైమ్‌లో అమల్లోకి తీసుకురావాలని సీరియస్‌గా ఆదేశించింది. పరిమితి దాటిన అదనపు సిమ్ కార్డులను వినియోగదారులు స్వచ్ఛందంగా వదులుకోవాలని సూచించింది. అలా చేయని పక్షంలో సంబంధిత టెలికాం కంపెనీలే వాటిని డీయాక్టివేట్ చేస్తాయని టెలికాం విభాగం స్పష్టం చేసింది. సబ్స్క్రైబర్లు తమ పేరిట ఎన్ని సిమ్‌లు ఉన్నాయో సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తనిఖీ చేసుకునే వెసులుబాటు ఉందని తద్వారా అధనంగా ఉన్న సిమ్ కార్డులను వదులుకోవాలని టెలికాం విభాగం సూచించింది.









