
Pune : ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ మరణం వెనుక అత్యంత పక్కాగా ప్లాన్ చేసిన ఒక పెద్ద హత్య కుట్ర దాగి ఉందని పోలీసులు జరిపిన విచారణలో తేలింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు, ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే లోహగడ్ కోట వద్దకు వెళ్లి.. కేతన్‌ను ఎలా తోసేయాలో రిహార్సల్స్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, హత్య చేసిన తర్వాత పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో కూడా వారు ముందే ప్రిపేర్ అయ్యారు. పోలీసులు జరిపిన ఈ లోతైన దర్యాప్తులో ఆన్లైన్ సెర్చ్‌లు, డిలీట్ చేసిన మెసేజ్‌లు వారి పక్కా ప్లానింగ్‌కు సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి.
పోలీసుల సమాచారం ప్రకారం.. కేతన్‌ను చంపడానికి మొదటి ప్రయత్నం జూన్ 14న జరిగింది. అయితే దీనికి నాలుగు ఐదు రోజుల ముందే నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరి ఒక చోట కలుసుకుని, లోహగడ్ కోట పైనుంచి కేతన్‌ను లోయలోకి ఎలా నెట్టేయాలో ప్లాన్ చేసుకున్నారు. కోటలోని వేర్వేరు ప్రాంతాల గురించి ముందే సమాచారం సేకరించిన ఈ జంట.. సియా ఎక్కడ నిలబడాలి, చేతన్ ఏ వైపు నుండి రావాలి, కేతన్‌ను ఏ వైపుగా లోయలోకి తోసేయాలి అనే విషయాలపై పూర్తి రిహార్సల్స్ చేశారు. కేతన్‌ను చంపడానికి సులువైన మార్గం లోహగడ్ కోట పైనుంచి తోసేయడమేనని నిర్ణయించుకోవడానికి ముందు.. వారు గూగుల్, యూట్యూబ్‌లలో మనుషులను చంపే రకరకాల పద్ధతుల గురించి వెతికినట్లు పోలీసులు కనుగొన్నారు.
Also Read : వెనిజులాలో భూకంపం: తన ప్రాణాలను అడ్డుపెట్టి బిడ్డను కాపాడిన ఫుట్‌బాలర్ భార్య!
సియా గోయల్, చేతన్ చౌదరి మొదట దీపావళి వేడుకలో కలుసుకున్నారు. ఆ తర్వాత మార్కెట్ యార్డ్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం సియా సోదరుడు సాహిల్ గోయల్‌కు కూడా తెలుసని పోలీసులు భావిస్తున్నారు. అయితే, కుటుంబ సంబంధాల ద్వారా కేతన్ అగర్వాల్‌తో సియాకు పెళ్లి సంబంధం కుదిరి, ఫిబ్రవరిలో నిశ్చితార్థం కూడా జరిగింది. నిశ్చితార్థం తర్వాత సియా కొన్నాళ్లు చేతన్‌కు దూరంగా ఉన్నప్పటికీ, మళ్లీ అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది. సియాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా, ఎంగేజ్‌మెంట్‌ను ఎలా రద్దు చేసుకోవాలో తెలియక, చివరికి చేతన్‌తో కలిసి కేతన్‌ను అంతమొందించాలని ప్లాన్ వేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో పెళ్లి ఫొటోషూట్లు, కుటుంబ వేడుకలు, బహుమతుల మార్పిడి జరుగుతున్నా.. లోలోపల ఈ పెళ్లిపై అనుమానాలు, కుట్ర సాగుతూనే ఉన్నాయి.
హత్య జరిగిన రోజున తన గుర్తు పట్టకుండా ఉండేందుకు చేతన్ చౌదరి ఒక హూడీ ధరించి, ముఖాన్ని దాచుకుంటూ లోహగడ్‌కు వెళ్లాడు. సియా, కేతన్‌లను ఫాలో అవుతూ కోటపైకి వెళ్లాక, ఆ హూడీని తీసి బ్యాగ్‌లో పెట్టేసుకున్నాడు. గతంలో సియాకు క్లోజ్ ఫ్రెండ్‌గా కేతన్‌తో రెండుసార్లు వీడియో కాల్స్ మాట్లాడటం వల్ల, కేతన్ తనను గుర్తుపడతాడేమోనని చేతన్ భయపడ్డాడు. కేతన్‌ను లోయలోకి తోసేసిన తర్వాత, చేతన్ మళ్లీ ఆ హూడీని వేసుకుని, ఏమీ తెలియనట్లు కోట కిందకు వచ్చేశాడు. దారిలో సామాన్య ప్రజలతో మామూలుగానే మాట్లాడుతూ, మధ్యలో టీ కూడా తాగి ఇంటికి వెళ్ళిపోయాడు.
Also Read : మరో భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు..!









