CM Vijay : తమిళనాడు సీఎం విజయ్ అవినీతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజంలో అవినీతిని వేళ్లతో సహా పెకలించి వేయడమే లక్ష్యంగా, ప్రజల్లో ధైర్యం నింపేలా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పనుల కోసం ఎవరైనా లంచం అడిగితే మొహమాటం లేకుండా నిరాకరించాలని, ప్రజలకు తన ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

మీ దగ్గరకు వచ్చి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే, నేరుగా ఇవ్వనని చెప్పేయండి. నేను మీకు తోడుగా ఉంటానని సంచలన ప్రకటన చేశారు. తమ TVK ప్రభుత్వంలో అవినీతికి అస్సలు తావులేదని, ఇది తమ ప్రభుత్వ ముఖ్య ఆశయమని ఆయన స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం మనందరి ఉమ్మడి బాధ్యత అని, లంచాల వేధింపులపై ప్రజలు ఎలాంటి భయం లేకుండా నిలబడాలని పిలుపునిచ్చారు.

Also Read : స్విట్జర్లాండ్ టూర్ పేరుతో రూ. 50 కోట్లకు ఐపీ.. హైదరాబాద్ జంట జంప్!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన అందించేందుకు విజయ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే, ఎవరైనా లంచం అడిగినట్లు సాక్ష్యాలు చూపిస్తే.. అలా నిజాయితీగా వ్యవహరించిన పౌరులకు ప్రభుత్వమే బహుమతులు ఇచ్చే సరికొత్త విధానాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లకు ఒక స్పష్టమైన హెచ్చరిక పంపేందుకే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టేబుల్ కింద చేతులు మార్చే పాత రోజులు ఇక చెల్లవని, తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

సీఎం ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. పాతకాలపు రాజకీయాలకు భిన్నంగా సీఎం విజయ్ సరికొత్త మార్పు తెస్తున్నారంటూ చాలా మంది ఆయనను ప్రశంసిస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా కరూర్‌కు వచ్చిన ఆయన, స్థానిక సమస్యలను తెలుసుకుంటూనే తన మంచి పాలన విజన్‌ను ప్రజల ముందుంచారు. తమిళనాడులో ఎవరినైనా లంచం అడిగితే, తగిన ఆధారాలను సేకరించి అవినీతి నిరోధక శాఖ లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని.. అలాంటి విషయాల్లో సీఎం కార్యాలయం నేరుగా జోక్యం చేసుకుని న్యాయం చేస్తుందని అధికారులు వెల్లడించారు.

Also Read : బహుభార్యత్వంపై అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం.. కాదని చేసుకుంటే అంతే సంగతులు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.