
Maharashtra : మహారాష్ట్రలో వింత దొంగతనం వెలుగు చూసింది. దేవుడికి దండం పెట్టుకుని, చెవులు పట్టుకుని క్షమాపణలు చెప్పిన ఇద్దరు వ్యక్తులు.. ఆ వెంటనే గుడిలో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఉన్న శీతలా దేవి ఆలయంలో జూలై 28వ తేదీ రాత్రి సుమారు 2:20 గంటలకు జరిగింది.
ఆలయ సీసీటీవీ ఫుటేజ్‌లో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఒక వ్యక్తి దేవుడి ముందు నిలబడి చేతులు జోడించి, తన చెవులు పట్టుకుని ప్రార్థన చేస్తుండగా.. మరొక వ్యక్తి హుండీ తాళం పగలగొట్టడానికి ప్రయత్నించాడు. క్షమాపణల తంతు ముగిసిన తర్వాత, మొదటి వ్యక్తి చుట్టుపక్కల కాపలా కాయగా, రెండో వ్యక్తి హుండీని పగలగొట్టే ప్రయత్నాన్ని కొనసాగించాడు.
Also Read : BMW సంచలన నిర్ణయం.. 8 వేల మంది ఉద్యోగులు ఔట్!
హుండీ తెరిచిన తర్వాత నిందితులు లోపల ఉన్న నగదును బయటకు తీశారు. ఆ డబ్బును ఒక సంచిలో సర్దుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం ఆలయ సిబ్బంది వచ్చి చూసేసరికి తాళాలు పగిలి ఉండటంతో దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఆలయ పూజారి జితేంద్ర పాండే తెలిపిన వివరాల ప్రకారం.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్లు తేలింది.
ఉదయం 8 గంటల ప్రాంతంలో గుడికి వచ్చి చూసేసరికి తాళాలు పగిలి ఉన్నాయి. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు వచ్చి ఫుటేజ్ పరిశీలించారని పూజారి తెలిపారు. గత ఏడాది కాలంగా ఈ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలు జరుగుతున్నాయని పూజారి పాండే ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఆలయంలో దేవుళ్ల వెలకట్టలేని ఆభరణాలు, హుండీ సొమ్ము చోరీకి గురయ్యాయని, ఇది మూడోసారని ఆయన పేర్కొన్నారు.
గతంలో సీసీటీవీ కెమెరాలు లేనప్పుడు అమ్మవార్ల బంగారు మంగళసూత్రాలు చోరీ అయ్యాయని, రెండోసారి హుండీ పగలగొట్టారని, ఇప్పుడు మళ్లీ హుండీని పగులగొట్టి దొంగతనం చేశారని ఆయన వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : షాకింగ్ రిపోర్ట్: భారతదేశంలో అత్యంత రిచెస్ట్ సీఎంలు వీరే.. నంబర్ 1 CM ఇతడే..!









