Mamata Banerjee
Mamata Banerjee

Bengal Bar Council polls : మూడు దశాబ్దాలుగా పశ్చిమబెంగాల్‌ రాజకీయాలను శాసిస్తూ వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి భారీ ఊరట దక్కిందనే చెప్పాలి. పశ్చిమ బెంగాల్‌ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో టీఎంసీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. తృణమూల్‌ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు భారీ విజయం నమోదు చేసుకున్నారు. అయితే, ఈ ఎన్నికలు మార్చి 9న పోలింగ్‌తో మొదలయ్యాయి. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికలు జరిగి ఉంటే టీఎంసీ ఇన్ని స్థానాల్లో విజయం సాధించేది కాదని బార్‌ కౌన్సిల్‌లో బీజేపీ మద్దతు దారులు అభిప్రాయపడుతున్నారు.

బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో 23 స్థానాలు ఉండగా వాటిలో 15 స్థానాల్ని తృణమూల్‌ కైవసం చేసుకుంది. బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ చెరో మూడు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. ఇక మహిళల కోసం రిజర్వ్‌ చేసిన ఐదు స్థానాల్లోనూ టీఎంసీ నాలుగు, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. గెలిచిన తృణమూల్ అభ్యర్థులంతా మమతా బెనర్జీ సిఫార్స్‌ల మేరకే పోటీ చేసినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా అభ్యర్థుల నుండి అదనంగా మరో ఇద్దరు మహిళా సభ్యులను నామినేట్ చేయనుంది. ఈ నామినేషన్లతో, పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ మొత్తం సభ్యుల సంఖ్య 25కు చేరనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 75 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో టీఎంసీ నుంచి 23 మంది అభ్యర్థులు, బీజేపీ నుంచి 22 మంది, లెఫ్ట్ ఫ్రంట్ 12 మంది, 18 మంది స్వతంత్రులు బరిలోకి దిగారు. ఫలితాల్లో బీజేపీ తన మునుపటి మూడు సీట్ల స్థానాన్ని కాపడుకుంది, కాంగ్రెస్ కూడా తన రెండు సీట్లను నిలుపుకుంది. అయితే, లెఫ్ట్ ఫ్రంట్ ప్రాతినిధ్యం గత ఎన్నికల్లోని నాలుగు సీట్ల నుండి ఈసారి మూడు సీట్లకు తగ్గింది.

ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ న్యాయవాదుల విభాగం సభ్యుడు సంజయ్ బర్ధన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అన్ని జిల్లా కోర్టులలోని ప్రాక్టీసింగ్ న్యాయవాదులు పాల్గొన్నారని తెలిపారు. అన్ని జిల్లా కోర్టులలో ప్రాక్టీసింగ్ న్యాయవాదులు వేసిన ఓట్ల ద్వారా గత మార్చిలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఏర్పడిందన్నారు. కొత్త నిబంధనల ప్రకారం, 23 సీట్లలో ఐదు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ మహిళా సీట్లలో నాలుగు సీట్లను తృణమూల్ దక్కించుకుందని బర్ధన్ వివరించారు.

అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, మార్చి 9న పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడం గమనార్హం. ఇప్పుడు ఫలితాలు వెలువడటంతో టీఎంసీ త్వరలో పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ కొత్త బోర్డును ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ న్యాయవాద వర్గంలోని కొన్ని వర్గాలలో పార్టీ సంస్థాగత ప్రభావం చెక్కుచెదరలేదనడానికి ఈ ఫలితం ఒక సంకేతంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.