LOC : జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులు మందుపాతర పేలడంతో చనిపోయారు. వీరిలో లష్కరే తోయిబా కీలక కమాండర్ మహమ్మద్ ఫైజాన్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో నాంగి టెక్రి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.

ఎల్‌ఓసీ వెంబడి చొరబాట్లను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన మందుపాతరల వ్యవస్థలో భాగంగా ఉన్న పేలుడు పదార్థాలు.. ఉగ్రవాదుల బృందం సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పేలాయి. దీంతో నలుగురూ అక్కడికక్కడే చనిపోయారు. మిగతా ముగ్గురిని వకాస్, ఇష్తియాక్, ఆసిమ్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

కృష్ణ ఘాటి సెక్టార్‌లోని సత్వాల్‌-నాకి ప్రాంతంలో, సరిహద్దు రేఖ సమీపంలో సోమవారం మరో పేలుడు జరిగినట్లు సమాచారం అందింది. పాకిస్థాన్ వైపు ఎల్‌ఓసీ వెంబడి ఓ బృందం కదులుతున్న సమయంలో అనుమానిత పేలుడు పరికరం (ఐఈడీ) పేలినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ సమయంలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారనే వివరాలు వెంటనే తెలియలేదు.

ఆ బృందంలో సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు ఉన్నారా? లేదా పెట్రోలింగ్ చేస్తున్న పాకిస్థాన్ భద్రతా సిబ్బంది ఉన్నారా? అనే విషయం కూడా మొదట్లో స్పష్టంగా తెలియలేదు. పేలుడు ఎలా జరిగిందనే దానిపైనా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తర్వాత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు వెంబడి నిఘాను పెంచి, ఎలాంటి చొరబాట్లు జరగకుండా తనిఖీలు ముమ్మరం చేశాయి.

మరోవైపు, పూంచ్ జిల్లాలోని మెంధర్ సెక్టార్‌ బసోని ప్రాంతంలో సరిహద్దు కంచె సమీపంలో రెండు పాత మందుపాతరలను సైన్యం గుర్తించింది. రోడ్డు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఉదయం 8.25 గంటలకు ఒకటి, మధ్యాహ్నం 12.10 గంటలకు మరొకటి కనిపించాయి. వెంటనే అక్కడికి చేరుకున్న సైనిక పేలుడు పదార్థాల నిపుణులు నియంత్రిత పేలుళ్ల ద్వారా వాటిని ధ్వంసం చేశారు. గత వారం రోజుల్లో ఈ ప్రాంతంలో దాదాపు పది మందుపాతరలను సైన్యం గుర్తించి నిర్వీర్యం చేసినట్లు అధికారులు తెలిపారు.

సరిహద్దు దాటి ఉగ్రవాదులు చొరబడకుండా అడ్డుకునేందుకు ఎల్‌ఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో మందుపాతరలను ఏర్పాటు చేశారు. అయితే భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు, మట్టి కొట్టుకురావడం వల్ల ఈ మందుపాతరలు తమ అసలు స్థానం నుంచి కదిలి ఇతర ప్రాంతాల్లోకి చేరే ప్రమాదం ఉంది. దీంతో అవి బయటకు కనిపించని చోట్ల ఉండిపోయి సైనికులకు, స్థానికులకు ముప్పుగా మారే అవకాశం ఉంది. మెంధర్‌లో పాత మందుపాతరలు బయటపడటం.. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.