UP Restaurant : ఉత్తరప్రదేశ్‌లో ఓ రెస్టారెంట్‌కు వింత అనుభవం ఎదురైంది. వాటర్ బాటిల్‌పై ఉన్న ధర కంటే కేవలం రూ.2 ఎక్కువ వసూలు చేసినందుకు ఏకంగా రూ.లక్ష జరిమానా పడింది. అంతేకాదు, ఫిర్యాదు చేసిన వ్యక్తికి పరిహారంగా రూ.1,000, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5,000 చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఈ ఘటన 2026 మార్చి 11న జరిగింది.

ఇంతకు ఏం జరిగిందంటే.. యూపీలోని అలీగఢ్‌కు చెందిన అంకుర్ అగర్వాల్.. హాథ్రస్‌లోని బీబీసీఎన్ రాయల్ రెస్టారెంట్ అండ్ పార్టీ హాల్‌కు భోజనం చేసేందుకు వెళ్లారు. అక్కడ ఆయన ఓ వాటర్ బాటిల్ ఆర్డర్ చేశారు. ఆ బాటిల్‌పై MRP రూ.18గా ఉంది. కానీ రెస్టారెంట్ నిర్వాహకులు ఆయన దగ్గర రూ.20 వసూలు చేశారు. కేవలం రూ.2 ఎక్కువ తీసుకున్నప్పటికీ అంకుర్ దీనిపై చట్టపరంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు.

Also Read : జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకే ఇదంతా చేస్తున్నావా.. మోదీపై అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు

రెస్టారెంట్ ఎక్కువ డబ్బులు వసూలు చేయడంపై అంకుర్ అలీగఢ్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. తన దగ్గర ఉన్న రెస్టారెంట్ బిల్లుతో పాటు వాటర్ బాటిల్ ఫొటోను ఆధారాలుగా సమర్పించారు. బాటిల్‌పై రూ.18 ఎంఆర్‌పీ ఉన్నప్పటికీ బిల్లులో రూ.20 వసూలు చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ ఫిర్యాదుపై తమ వాదనను వినిపించేందుకు రెస్టారెంట్‌కు కూడా అవకాశం ఇచ్చారు. అయితే, రెస్టారెంట్ తరఫున ఎవరూ విచారణకు హాజరుకాలేదు. దీంతో అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన కమిషన్ తన నిర్ణయాన్ని ప్రకటించింది.

2026 అక్టోబర్ 12న జిల్లా వినియోగదారుల కమిషన్ ఈ కేసులో తీర్పు ఇచ్చింది. బాటిల్‌పై ముద్రించిన ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధర వసూలు చేయడం వినియోగదారులను మోసం చేసే వ్యాపార పద్ధతిగా పరిగణించింది. దీంతో బీబీసీఎన్ రాయల్ రెస్టారెంట్ అండ్ పార్టీ హాల్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధిలో జమ చేయాలని ఆదేశించింది.

అంతేకాదు, ఫిర్యాదుదారుడైన అంకుర్ అగర్వాల్‌కు రూ.1,000 పరిహారం, న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ.5,000 చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడానికి రెస్టారెంట్‌కు 45 రోజుల గడువు ఇచ్చింది. ఆలోగా చెల్లింపులు చేయకపోతే మరిన్ని చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కేవలం రూ.2 విషయంలో మొదలైన వివాదం చివరకు రూ.లక్ష జరిమానా పడే వరకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read : వాట్సాప్ యాప్ లేకున్నా ఫ్రీ కాల్స్.. అదిరిపోయే ‘గెస్ట్ కాల్స్’ ఫీచర్ వచ్చేసింది..!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.