Wife Killed Husband : గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఓ దారుణ హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భర్తకు సైనైడ్ ఇచ్చి హత్య చేసిన ఓ భార్య, ప్రియుడితో కలిసి మృతదేహాన్ని పాడుబడిన పారిశ్రామిక షెడ్డులో 12 అడుగుల లోతులో పాతిపెట్టింది. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా రెండేళ్లపాటు కట్టుకథలతో అందరినీ బురిడీ కొట్టించింది.

జిగ్నేష్ మావడియా, పృథ్వి అలియాస్ భూమిబెన్ ప్రేమవివాహం చేసుకోగా, వీరికి ఆరేళ్లలోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, కొన్నేళ్లుగా జిగ్నేష్ కుటుంబ సభ్యులకు కానీ, బంధువులకు కానీ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయాడు. తన భర్త ఉద్యోగ నిమిత్తం ఉన్నపళంగా ఆస్ట్రేలియా వెళ్లాడని, అక్కడి కంపెనీ నిబంధనల వల్ల ఫోన్ మాట్లాడటానికి అనుమతి లేదని పృథ్వి అందరినీ నమ్మిస్తూ వచ్చింది.

శాశ్వత నివాస అనుమతి (పర్మనెంట్ రెసిడెన్సీ) వచ్చిన తర్వాతే జిగ్నేష్ భారత్‌కు తిరిగి వస్తాడని చెప్తూ రావడం వల్ల రెండేళ్లపాటు కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానం రాలేదు. అయితే, ఇటీవల జిగ్నేష్ బంధువు ఒకరు ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమై, అతడిని కలవడానికి చిరునామా, ఫోన్ నంబర్ ఇవ్వాలని పృథ్విని గట్టిగా నిలదీశాడు. ఎంత అడిగినా వివరాలు ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Also Read : అత్తమామలు వరకట్న వేధింపులు.. టీచర్ సూసైడ్.. VIDEO VIRAL

దీంతో అనుమానం వచ్చిన జిగ్నేష్ సోదరుడు అశోక్ మావడియా జూలై 26న సిటీ ‘బి’ డివిజన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పృథ్వి, ఆమె ప్రియుడు నీలేష్ కచ్ఛాటియా, వారి సహచరుడు బల్వీర్ వర్మలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

2024 మే 31వ తేదీ రాత్రి పృథ్వి తన ప్రియుడు నీలేష్, బల్వీర్‌లతో కలిసి జిగ్నేష్‌కు మద్యం పార్టీ ఉందంటూ ఆశ చూపి సైనైడ్‌ కలిపిన మద్యం తాగించి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. జిగ్నేష్, నీలేష్ ఇద్దరూ కలిసి లీజుకు తీసుకున్న దారెడ్ జీఐడీసీ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ షెడ్డులోనే ఈ దారుణానికి ఒడిగట్టారు.

హత్య అనంతరం మృతదేహాన్ని షెడ్డులోనే 12 అడుగుల లోతైన గుంత తవ్వి పాతిపెట్టారు. సాక్ష్యాధారాలు లభించకుండా ఉండేందుకు గుంతపై మట్టి కప్పి, దానిపై సుమారు అడుగు మందంతో కాంక్రీట్ పొరను వేసి నేలను సీల్ చేశారు. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో గురువారం వారిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్‌ను రీకన్‌స్ట్రక్ట్ చేశారు.

కాంక్రీట్ పొరను పగలగొట్టడానికి అధికారులు పవర్ టూల్స్‌ను ఉపయోగించి 12 అడుగుల తవ్వకాలు జరిపి అస్థిపంజర అవశేషాలను వెలికితీశారు. వెలికితీసిన అవశేషాలు జిగ్నేష్‌విగా భావిస్తున్నప్పటికీ, అధికారిక ధృవీకరణ కోసం ఫోరెన్సిక్ నిపుణులకు (FSL) పంపినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రతిభ తెలిపారు.

హత్య, సాక్ష్యాధారాల ధ్వంసం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలడంతో, ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య క్రూరత్వం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Also Read : థాయ్‌లాండ్‌లో ‘బడ్జెట్ టూర్’ పేరిట ముగ్గురు భారతీయ యువకుల కిడ్నాప్: ఐదుగురు నిందితుల అరెస్ట్

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.