Pakistan : దుబాయ్‌లో భారత్‌తో జరిగిన మహిళల ఆసియా కప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమె మ్యాచ్‌ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. దీంతో పాటు ఆమె డిసిప్లినరీ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా జోడించింది. భారత ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో ఓపెనర్ షఫాలీ వర్మను ఫాతిమా సనా ఔట్ చేశారు. అనంతరం ఆమె పెవిలియన్ వైపు చూపిస్తూ సంజ్ఞ చేశారు. బ్యాటర్ ఔటైన తర్వాత ఆమెను కించపరిచేలా లేదా దూకుడుగా స్పందించేలా ప్రేరేపించే చర్యలకు పాల్పడకూడదనే ఐసీసీ కోడ్‌లోని ఆర్టికల్‌ 2.5ను ఫాతిమా ఉల్లంఘించినట్లు తేలింది.

ఇది 24 నెలల వ్యవధిలో ఫాతిమా చేసిన రెండో తప్పిదం కావడంతో ఆమె డీమెరిట్ పాయింట్ల సంఖ్య రెండుకు చేరింది. 2025 ఆగస్టు 6న డబ్లిన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనూ ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్‌ వచ్చింది. తన తప్పును ఫాతిమా అంగీకరించారు. ఐసీసీ మ్యాచ్‌ రిఫరీల ప్యానెల్‌కు చెందిన సుప్రియా రాణి దాస్‌ ప్రతిపాదించిన శిక్షను కూడా ఆమె అంగీకరించడంతో ప్రత్యేకంగా విచారణ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ఫాతిమాపై ఫీల్డ్‌ అంపైర్లు నిమాలి పెరీరా, శతీర జాకిర్ జెసీ, థర్డ్‌ అంపైర్ రొకేయా సుల్తానా, ఫోర్త్‌ అంపైర్ రబాబ్ అహ్సన్‌ అభియోగాలు నమోదు చేశారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం లెవల్‌-1 ఉల్లంఘనలకు అధికారిక హెచ్చరిక నుంచి ఆటగాడి మ్యాచ్‌ ఫీజులో గరిష్ఠంగా 50 శాతం జరిమానా వరకు విధించవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు కూడా ఇవ్వొచ్చు. ఒక ఆటగాడికి 24 నెలల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు వస్తే.. అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారతాయి. రెండు సస్పెన్షన్ పాయింట్లు వస్తే ఒక టెస్ట్‌ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20 మ్యాచ్‌లపై నిషేధం పడుతుంది. డీమెరిట్ పాయింట్లు విధించిన తేదీ నుంచి 24 నెలల పాటు ఆటగాడి రికార్డులో ఉంటాయి. ఆ తర్వాత అవి తొలగిపోతాయి.

ఇక భారత్‌తో మ్యాచ్‌లో షఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత ఫాతిమా చేసిన సంజ్ఞే ఇప్పుడు ఆమెకు జరిమానాతో పాటు మరో డీమెరిట్ పాయింట్‌ రావడానికి కారణమైంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.