
Pakistan : పాకిస్తాన్ క్రికెట్‌లో కెప్టెన్ల మార్పుల ఆట మళ్లీ మొదలైంది. ఊహించినట్లుగానే షాన్ మసూద్‌ను టెస్ట్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో మళ్లీ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్‌ను నియమించారు. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఆదివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. త్వరలో జరగబోయే వెస్టిండీస్, ఇంగ్లాండ్ పర్యటనల్లో బాబర్ అజామ్ పాక్ టెస్ట్ జట్టును నడిపించనున్నాడు.
గత 2023-2024 సీజన్ లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన షాన్ మసూద్ నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు ఘోరమైన ప్రదర్శన చేసింది. అతను కెప్టెన్‌గా ఉన్న 16 మ్యాచ్‌లలో పాకిస్తాన్ కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచి, ఏకంగా 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ముఖ్యంగా రెండు నెలల క్రితం బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాకిస్తాన్ తన సొంత గడ్డపైనే 0-2తో క్లీన్‌స్వీప్ అవ్వడం సెలక్టర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో పాక్ జట్టు అందరికంటే చివరి స్థానానికి పడిపోయింది. మసూద్ బ్యాట్స్‌మెన్‌గా 1,056 పరుగులు చేసి బాగానే ఆడినా, కెప్టెన్‌గా జట్టును గెలిపించలేకపోవడంతో అతనిపై వేటు పడింది.
మరోవైపు బాబర్ అజామ్‌కు కెప్టెన్సీ ఇవ్వడం ఒక పెద్ద ప్రయోగమనే చెప్పాలి. ఎందుకంటే గత మూడేళ్లుగా టెస్ట్ క్రికెట్‌లో బాబర్ అజామ్ అస్సలు ఫామ్‌లో లేడు. 2022 తర్వాత అతను కనీసం ఒక్క సెంచరీ కూడా చేయలేదు. గతంలో 2021 నుండి 2023 వరకు బాబర్ టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ 2023 వన్డే వరల్డ్ కప్‌లో జట్టు ఘోరంగా ఓడిపోవడంతో అతనిని కెప్టెన్సీ నుండి తీసేశారు. ఆ తర్వాత 2024 టీ20 వరల్డ్ కప్‌నకు ముందు మళ్లీ టీ20 కెప్టెన్‌ను చేసినా, అక్కడ కూడా జట్టు విఫలం కావడంతో మళ్లీ తీసేశారు. ఇప్పుడు తాజాగా మూడోసారి అతనికి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్సీ ఇస్తేనైనా బాబర్ మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తాడని సెలక్టర్లు నమ్ముతున్నారు.
బాబర్ అజామ్ కెప్టెన్‌గా పాకిస్తాన్ జట్టు జూలై 25 నుండి ఆగస్టు 6 వరకు వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వెంటనే ఇంగ్లాండ్‌కు వెళ్లి ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 13 వరకు మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనల కోసం జట్టులోకి అలీ ఉస్మాన్, ముహమ్మద్ అవైస్ జఫర్, ఉబైద్ షా, ముహమ్మద్ గాజీ ఘోరి అనే నలుగురు కొత్త యువ ఆటగాళ్లను ఎంపిక చేశారు.
Also Read : మమతకు మరో భారీ షాక్: అన్ని పదవులకూ కీలక నేత రాజీనామా!
వెస్టిండీస్ టూర్ షెడ్యూల్:
జూలై 25-29: మొదటి టెస్ట్ (తారౌబా)
ఆగస్టు 2-6: రెండో టెస్ట్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
ఇంగ్లాండ్ టూర్ షెడ్యూల్:
ఆగస్టు 19-23: మొదటి టెస్ట్ (లీడ్స్)
ఆగస్టు 27-31: రెండో టెస్ట్ (లార్డ్స్)
సెప్టెంబర్ 9-13: మూడో టెస్ట్ (బర్మింగ్‌హామ్)
Also Read : ఆగ్రాలో దారుణం…భర్తను చంపి బాత్‌రూమ్ కింద పాతిపెట్టిన భార్య









