
ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు బిజీ షెడ్యూల్ మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. రాబోయే జింబాబ్వే పర్యటనతో పాటు ఈ ఏడాది జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడలు-2026 కు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అందుబాటులో ఉండటం లేదు. ఆయన స్థానంలో నేషనల్ క్రికెట్ అకాడమీ అధినేత, మాజీ స్టార్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం. ఒకే సమయంలో రెండు వేర్వేరు సిరీస్‌లు జరగనుండటంతో బీసీసీఐ కోచింగ్ బాధ్యతలను ఇద్దరి మధ్య విభజించాలని నిర్ణయించింది.
ముఖ్యంగా సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జపాన్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. అయితే సరిగ్గా అదే సమయంలో సెప్టెంబర్ 27 నుండి స్వదేశంలో వెస్టిండీస్‌తో భారత సీనియర్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది. వెస్టిండీస్ సిరీస్‌లో సీనియర్ జట్టుతో గౌతమ్ గంభీర్ ఉంటారు కాబట్టి, ఆసియా గేమ్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టు బాధ్యతలను లక్ష్మణ్ చూసుకోనున్నారు. లక్ష్మణ్‌తో పాటు పాత కోచింగ్ బృందం కూడా రంగంలోకి దిగుతోంది. భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి బౌలింగ్ కోచ్‌గా, మాజీ బ్యాటర్ హృషికేష్ కనిత్కర్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఇదే సపోర్ట్ స్టాఫ్ జింబాబ్వే పర్యటనకు కూడా వెళ్లనుంది.
ఇలాంటి కీలక సమయాల్లో టీమిండియాకు పెద్ద దిక్కుగా మారడం వీవీఎస్ లక్ష్మణ్‌కు కొత్తేమీ కాదు. గతంలో 2022లో ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలతో పాటు ఆసియా కప్, న్యూజిలాండ్ సిరీస్‌లలో కూడా ఆయన తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించి జట్టుకు విజయాలు అందించారు. అంతేకాదు, 2023 ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు గోల్డ్ మెడల్ గెలవడంలో లక్ష్మణ్ కోచింగ్ కీలక పాత్ర పోషించింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ ముగిసిన వెంటనే, జూలై 23 నుండి 26 వరకు జింబాబ్వేతో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ల కోసం యంగ్ టీమ్‌ను సిద్ధం చేశారు. ఈ పర్యటనలో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో పాటు మయాంక్ యాదవ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, అశోక్ శర్మ లాంటి యువ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్నారు.









