
IPS : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో సంచలన నిజం వెలుగులోకి వస్తోంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు అత్యంత షాకింగ్ విషయాలను పొందుపరిచారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా మొదలైన ఈ పరిచయం చివరికి తీవ్రమైన నేరాలకు ఎలా దారితీసిందనే అంశంపై పోలీసులు స్పష్టమైన వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అంతకుముందు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసి, సివిల్స్ సాధించి ఐపీఎస్‌గా ఎంపికైన ఉదయ్ కృష్ణారెడ్డి సక్సెస్ జర్నీని చూసి 2025లో ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నారు. అప్పట్లో ఆమె కూడా మరో బ్యాచ్‌కు ఎంపికై ఈఓఎల్‌లో ఉండటంతో వీరి పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే మరింత దగ్గరయ్యేలా చేసింది. ఉదయ్ లైఫ్ స్టోరీని పూర్తిగా తెలుసుకున్న ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్‌తో ఆయన ఎంతో చనువుగా ఉన్నారు.
కొంతకాలం పాటు వీరిద్దరి మధ్య సాగిన సాన్నిహిత్యం ఆ తర్వాత విభేదాలకు దారితీసింది. తోటివారితో లేదా ఇతరులతో ఎవరైనా సరే మాట్లాడితే ఆ లేడీ అధికారిపై ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్రమైన అనుమానం పెంచుకునేవాడు. ఆమెను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో జాతీయ పోలీస్ అకాడమీలోనే వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ ముస్సోరీలో ఇద్దరూ దగ్గరయ్యారు. అయినప్పటికీ ఉదయ్‌లో మార్పు రాలేదు. విపరీతమైన అనుమానంతో ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించడం కొనసాగించాడు. ఏకంగా ఐదు సార్లు ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై ఉదయ్ చేయి చేసుకుని దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తేలింది.
Also Read : 2034 వరకు సీఎంగా ఉంటా.. ఏం డౌట్ వద్దు : సీఎం రేవంత్ రెడ్డి
బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు మే నెలలో వేరే వ్యక్తితో వివాహం జరిగింది. ఆ పెళ్లి తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. తనను వదిలిపెట్టకుండా పదే పదే వేధిస్తుండటంతో విసిగిపోయిన బాధితురాలు తన భర్త సహకారంతో అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ కేసు దర్యాప్తును మరింత లోతుగా చేపట్టిన పోలీసులకు విస్మయకర విషయాలు తెలిశాయి. కేవలం బాధితురాలినే కాకుండా, ఉదయ్ కృష్ణారెడ్డి మరికొంత మంది యువతులను కూడా సోషల్ మీడియా వేదికగా చాట్ చేస్తూ వేధించినట్లు గుర్తించారు. హైదరాబాద్‌తో పాటు తన స్వగ్రామంలోనూ పలువురు యువతను ఆయన వేధించినట్లు ఆధారాలు సేకరించారు.
ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు తాజాగా మరో కీలక ట్విస్ట్ ఇచ్చారు. బాధితురాలి స్టేట్‌మెంట్, వైద్య నివేదికల ఆధారంగా ఉదయ్ కృష్ణారెడ్డిపై ఉన్న సెక్షన్లను మరింత తీవ్రతరం చేశారు. ఆయనపై ఉన్న అభియోగాలను బట్టి పోలీసులు తాజాగా హత్యాయత్నం, రేప్ వంటి తీవ్రమైన కొత్త సెక్షన్లను నమోదు చేశారు.
అజ్ఞాతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఉదయ్‌ను పోలీసులు ఇటీవల మిర్యాలగూడ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతంర రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఆయనకు ఆగస్టు 11 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.
Also Read : పేరు మార్చేసిన ఆ ఒక్క ‘పావలా’ నాటిక.. సీనియర్ నటి శ్యామల లైఫ్ చేంజింగ్ స్టోరీ!









