CM Revanth Reddy : కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మీడియా, సోషల్ మీడియాలో ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసినా అవన్నీ కుదరకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అఘోర పూజలు చేస్తున్నారని బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సంగారెడ్డిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ పదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలు నాశనం కావాలని పొరుగు రాష్ట్రాల్లో అఘోర పూజలు చేయించాడని పరోక్షంగా హరీశ్‌రావును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నం తినేవాడు ఎవడైనా ఈ రాష్ట్రంలో కరువు రావాలని, ప్రభుత్వం కూలిపోయి రాష్ట్రం అల్లకల్లోలం కావాలని చేతబడులు చేయిస్తారా అని తీవ్రంగా ప్రశ్నించారు. నా మీద, మా నాయకులు మీద చేతబడులు చేస్తే ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజల మీద ఎవరైనా చేస్తారా? అంటూ ఆయన మండిపడ్డారు. శవాల మీద అధికారంలోకి రావాలని వారు అనుకుంటున్నారని అందులో భాగంగానే ఇవ్వన్నీ చేయిస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

ప్రతి చిన్ని విషయాన్ని సోషల్‌ మీడియాలో పెట్టే మీరు పొరుగు రాష్ట్రాల్లో దేవాలయాలకు వెళ్తే ఎందుకు పోస్టులు పెట్టలేదని రేవంత్‌ ప్రశ్నించారు. ఈ విషయాన్ని అడిగినందుకు పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్‍కు నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. శివమొగ్గ గుడికి వెళ్లింది చెప్పకుండా దాస్తూ ఎందుకు పిల్లిమొగ్గలు వేస్తున్నారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మా ఆలోచనలు, సంకల్పం గొప్పవి కాబట్టే మాకు ప్రకృతి, దేవుడు సహకరిస్తున్నాడన్నాడని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యువతను మభ్యపెట్టేందుకు అగ్గిపెట్టేరావు, అఘోరరావులు వస్తారని అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని యువకులకు సీఎం సూచించారు. వీళ్లకు అగ్గిపెట్టెలు దొరకవు కానీ అమాయక యువతను బలి చేస్తారని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని, ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. దుర్మార్గులు , దుష్టులు మాయమాటలతో వస్తారు, యువత నమ్మొద్దు అని సూచించారు.

Also Read : పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన మీకెందుకు రాలేదు..సీఎం రేవంత్ రెడ్డి

జగ్గారెడ్డి నంబర్ వన్‌ నాయకుడు

కాగా, ఈ సభలో జగ్గారెడ్డిని ఉద్దేశించి రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి పర్యవేక్షణలో పండుగ రోజు ఈ సభ నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. జగ్గారెడ్డి 30 ఏళ్ల నుంచి నా దోస్తు అన్న రేవంత్‌ రెడ్డి జగ్గారెడ్డి నేను నిలబడను అంటే కాదు జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారన్నారు. ఇంకోసారి జగ్గారెడ్డి అలా అంటే వారం రోజులు ఇంట్లో పెట్టి తాళం వేయండి.1000 కోట్లు ఇచ్చిన మీకు జగ్గారెడ్డి లాంటి నాయకుడు దొరకడు. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ నాయకుడు జగ్గారెడ్డి. జగ్గారెడ్డిని కాపాడుకునే బాధ్యత మీది. జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి. ఓ సోదరుడిగా జగ్గారెడ్డకి అండగా ఉండాలని కోరుకుంటునన్నారు రేవంత్‌ రెడ్డి.

Also Read : తెలంగాణలో కొత్త స్కీమ్.. ఒక్కొక్కరికీ రూ.1.50 లక్షలు.. కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.