
Gutta Sukender Reddy : తెలంగాణ మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని, అలా చేస్తే కొత్తదనం వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడన్న గుత్తా ముఖ్యమంత్రిని పని చేసుకోనివ్వాలని, ఆటంకాలు సృష్టించకూడదని హితవు పలికారు. కాంగ్రెస్ క్యాడర్లో అసంతృప్తి ఉన్నమాట నిజమేనన్న గుత్తా.. కాంగ్రెస్ పాలనపై సాధారణ ప్రజలు సంతృప్తికరంగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ రోజు మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Also Read : సూర్యాపేట జిల్లాలో దారుణం.. వేపచెట్టు వివాదం.. ఇద్దరి దారుణహత్య
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పథకాలను కొనసాగించాలని సుఖేందర్ రెడ్డి కోరారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కొత్త వాటిని అమలు చేస్తున్నారని కూడా కొనియాడారు. అలాగే మంత్రివర్గంపైనా గుత్తా మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు దాటిందని, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తే కొత్తదనం వస్తుందని సూచించారు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీలోనూ క్రమశిక్షణ సరిగా లేదని అభిప్రాయపడ్డ సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు తగ్గించాలని కోరారు. అదేవిధంగా పార్టీ లైన్ దాటిన వారిపై వేటు వేయకపోతే పార్టీకి నష్టం తప్పదన్నారు. పార్టీలో లీకేజీలను కంట్రోల్ చేయాలని అలాగే కార్యకర్తలకు క్రమశిక్షణ అవసరమని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక, రైతులు పండించే నాలుగు పంటలకూ రైతు భరోసా అందించాలని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సీం ను కోరారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో తీసుకువచ్చిన 22ఏను రద్దు చేయాలని సూచించారు. ప్రజలకు వీలయినంత వరకు ఉచిత పథకాలను తగ్గించాలని, నిజమైన లబ్ధిదారులకే వాటిని చేరేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయకూడదని, వారికి న్యాయం చేయాలని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు.
Also Read : బంగారం, వెండి ధరలు ఢమాల్… ఈ రోజు కొన్నవారికి లక్కీ ఛాన్స్..?









