cm revanth reddy

CM Revanth Reddy : తన రాజకీయ ప్రస్థానంలో మిడ్జిల్ మండల ప్రజలు పోషించిన పాత్రను సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2006 జులై 4వ తేదీన మిడ్జిల్ మండల ప్రజలు తనను ఆశీర్వదించారని, ఆనాడు వారు నాటిన మొక్కే ఇవాళ పెద్ద వృక్షమై ముఖ్యమంత్రి స్థాయికి చేరిందని ఆయన పేర్కొన్నారు. 2006లో జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు, తన సొంత నియోజకవర్గం కాకపోయినా మిడ్జిల్ ప్రజలు నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకమే తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని చెబుతూ ఆ మండల ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో, ఆనాడు తనపై పోటీ చేసి ఓడిపోయిన రబ్బానీకి ప్రభుత్వంలో ఏదో ఒక బాధ్యత అప్పగిస్తామని సీఎం హామీ ఇచ్చారు. తన వల్ల ఎవరికీ కష్టం, నష్టం కలగకూడదన్నదే తన ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా గొప్పతనాన్ని కొనియాడుతూ.. గత హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు, అలాగే దేశానికి ఎంపీగా, కేంద్రమంత్రిగా సేవలందించిన జైపాల్ రెడ్డి ఈ జిల్లా బిడ్డలేనని రేవంత్ రెడ్డి గర్వంగా గుర్తుచేశారు.

తీవ్రస్థాయిలో విమర్శలు

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత పాలకుల హయాంలో రాష్ట్రంలో ఏకంగా రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. ఆ అప్పుల లెక్కలు చెప్పాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా, బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటూ ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారని ఆరోపించారు. దొర దురహంకారాన్ని మరోసారి బొంద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో వందేళ్లుగా కులగణన జరగలేదని, కానీ తమ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేపట్టి దేశానికే దిక్సూచిగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.