
Revanth Reddy : ములుగు జిల్లా మేడారం పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రక్తం పంచుకు పుట్టకపోయినా మంత్రి సీతక్కను సొంత ఆడబిడ్డగా చూసుకుంటున్నాం. కానీ, కొందరు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లినే బయటకు నెట్టారని పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. సొంత చెల్లికే న్యాయం చేయని వారు.. రాష్ట్రంలోని 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. కూతురుపై కుమారుడు దౌర్జన్యం చేస్తుంటే మందలించాల్సిన తండ్రి ఫాంహౌస్‌లో పడుకున్నడు. సొంత బిడ్డను ఇంటి నుంచి బయటకు వెళ్లగొడుతుంటే మౌనంగా ఉండిపోయిండు. అంటే కుమారుడు చేసిన నేరంలో తండ్రికి కూడా సగభాగం ఉన్నట్లే అంటూ ఆరోపించారు. అలాంటి తండ్రీకుమారులు రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకొకరు అఘోరారావు.. అఘోరా పూజలు చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడాలని, రాష్ట్రం నాశనం కావాలని కోరుకున్నారు. కానీ, దేవుడు మనవైపు ఉన్నాడు.. వర్షాలు కురిపించాడని రేవంత్ అన్నారు.
మేడారంలో వనదేవతలను బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రామప్ప దేవాలయంతో సమానంగా సమ్మక్క, సారలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ‘‘ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ములుగు నుంచే పాదయాత్ర మొదలు పెట్టామని రేవంత్ గుర్తు చేశారు. పోరాటానికి, పౌరుషానికి మారుపేరైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని పాదయాత్ర చేపట్టాం. ప్రజల సమస్యలు తెలుసుకుని తీరుస్తామని హామీ ఇచ్చామన్నారు. మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాం. మల్లూరు నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జంపన్న వాగును కూడా నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తాం. ములుగు ప్రాంత అభివృద్ధికి ఏం కావాలో చెబితే నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.









