
Khairatabad By-Election : ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు స్పీకర్, ఈసీకి కూడా సమాచారం ఇచ్చింది. ఈ విషయమై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని.. అప్పటివరకు స్టే ఇవ్వాలన్న ఆయన లాయర్ల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన క్షణం నుంచే ఆయనపై అనర్హత వేటు అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఒక వేళ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఇదే తీర్పు రిపీట్ అవుతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమని తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీకి రెడీ అంటూ దానం నాగేందర్ కూడా ఈ నేపథ్యంలోనే కామెంట్ చేశారన్న చర్చ సాగుతోంది. ఏదైనా కారణంతో శాసనసభా నియోజకవర్గం ఖాళీ అయితే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధన ఉంది. దీంతో మార్చిలోగా ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అయితే.. జనవరి-ఫిబ్రవరి మధ్యలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తర ఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే సమయంలో అప్పటి వరకు ఖాళీగా ఉన్న స్థానాలకు కూడా ఈసీ ఉప ఎన్నికలను నిర్వహిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ తో పాటే ఖైరతాబాద్ కు కూడా ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది.
Also Read : మమత అభ్యర్థి యూటర్న్.. ఉదయం తప్పుకుని, సాయంత్రానికి మళ్లీ బరిలోకి!
అభ్యర్థులు ఎవరు?
ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ బరిలోకి దిగడం ఖాయమనే చెప్పొచ్చు. బీఆర్ఎస్ తరఫున గతంలో ఇక్కడి నుంచి బరిలోకి దిగిన విజయారెడ్డి ఇప్పుడు హస్తం పార్టీలో ఉన్నారు. దీంతో కారు పార్టీ ఇప్పుడు కొత్త అభ్యర్థినే పోటీకి దించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఈ ప్రాంతంలో తిరుగులేని నేతగా ఉన్న పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వైపు బీఆర్ఎస్ మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉందనే ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన చింతల రామచంద్రారెడ్డి మరో సారి ఆ పార్టీ నుంచి పోటీకి దిగే ఛాన్స్ ఉంది.
రేవంత్ కు బిగ్ ఛాలెంజ్..
గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో సత్తా చాటినా హైదరాబాద్ రీజియన్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. దీంతో ఆ కొన్ని నెలలకే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో రాజధాని గడ్డపై ఎలాగైనా సత్తా చాటాలని రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారు. బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కు గాలం వేసి పార్టీలో చేర్చుకున్నారు. ఆ వెంటనే సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. బీసీ కావడం, గతంలో మంత్రిగా జంట నగరాల్లో చక్రం తిప్పిన దానంకు టికెట్ ఇస్తే తమకు కలిసి వస్తుందని లెక్కలు వేశారు. అయితే.. ఆఖరి నిమిషం వరకు గట్టి పోటీ ఇచ్చిన దానం విజయ తీరానికి మాత్రం చేరలేదు. 4 లక్షలకు పైగా ఓట్లు సాధించినా.. 49 వేల తేడాతో ఓడిపోయారు. దీంతో ఎమ్మెల్యేగానే కంటిన్యూ అయ్యారు. ప్రస్తుతం అనర్హత వేటు వేయడంతో ఆయన మాజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ ను మరోసారి గెలిపించడం రేవంత్ రెడ్డికి బిగ్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత వచ్చే ఈ ఎన్నికలు ఆయనకు సెమీ ఫైనల్ గా చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి కాంగ్రెస్ ను గెలిపించి కోర్ హైదరాబాద్ లో పార్టీ జెండా ఎగురవేసిన రేవంత్.. ఇప్పుడు ఖైరతాబాద్ కోసం ఎలాంటి ప్లాన్ వేస్తారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.
బీఆర్ఎస్ కు అగ్ని పరీక్ష..
దానం నాగేందర్ పార్టీ వీడిన నాటి నుంచి ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర పోరాటం చేసింది. అయితే.. దానం పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పిటిషన్ ను స్పీకర్ డిస్మిస్ చేయడంతో మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు గులాబీ నేతలు. ఈ నేపథ్యంలో రెండేళ్లకు పైగా ఆ పార్టీ చేసిన న్యాయ పోరాటం నేడు ఫలించింది. దానంపై అనర్హత వేటు వేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే.. బీఆర్ఎస్ కు అసలైన పరీక్ష ఇప్పుడు మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పట్టుబట్టి వేటు పడేలా అన్ని ప్రయత్నాలు చేసిన గులాబీ నేతలు ఇప్పుడు అధికార పార్టీని ఓడించకపోతే ఫలితం లేకుండా పోతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్స్ లాంటి ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుకోసం ఆ పార్టీ ఎలాంటి ప్లాన్ వేస్తుందనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.
Also Read : కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి… ధరలు పెరడగానికి అసలు కారణం ఏంటంటే?
బీజేపీకి చావో రేవో..
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సమానంగా 8 సీట్లలో గెలిచి తామే ప్రత్యామ్నాయం అన్న బీజేపీకి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో మాత్రం డిపాజిట్ దక్కలేదు. దీంతో మళ్లీ ఆ పార్టీ సెకండ్ నుంచి థర్డ్ ప్లేస్ కు పడిపోయింది. తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ ప్రకటనలు చేస్తున్న ఆ పార్టీ నేతలకు ఈ ఎన్నిక సవాల్ గా మారనుంది. ఈ సారి కూడా జూబ్లీహిల్స్ మాదిరి ఫలితమే వస్తే ఆ పార్టీకి మూడో ప్లేస్ ఫిక్స్ అయ్యే ప్రమాదం ఉంది.









