Dial 112 : రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం ఇకపై ఒకే నంబర్ అందుబాటులో ఉండనున్నది. ఇప్పటి వరకు పోలీసులకు 100, అంబులెన్స్, అగ్నిమాపక సేవలకు వేర్వేరు నంబర్లను ఉపయోగించగా వాటిని రద్దు చేస్తూ, ఇక నుంచి వాటన్నింటికీ ‘డయల్ 112’ అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో కొత్త ఎమర్జెన్సీ కాల్ సెంటర్‌ను డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. అత్యవసర సమయాల్లో వేగవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించడం కోసమే ఈ కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. పౌరులు ఇకపై విభిన్న రకాల హెల్ప్‌లైన్ నంబర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని, 112 నంబర్‌తో అన్ని రకాల ఎమర్జెన్సీ సేవలు అందుతాయన్నారు.

Also Read : రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 52 కాలేజీల గుర్తింపు రద్దు?

112కి వచ్చే కాల్‌ను ఏఐ సిస్టమ్ తో విశ్లేషించి, కాల్‌ను సరైన విభాగానికి బదిలీ చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా కాల్ చేసిన వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తుందని చెప్పారు. దీనివల్ల ఆపరేటర్లు కొన్ని నిమిషాల్లోనే సరైన అత్యవసర విభాగాన్ని ఘటనా స్థలానికి పంపడానికి వీలవుతుందన్నారు. ఒకేసారి 900 కంటే ఎక్కువ కాల్స్ ను స్వీకరించేలా వ్యవస్థను రూపొందించామన్నారు. దేశంలోనే తొలిసారిగా అత్యవసర సమయాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయడానికి ‘ఫస్ట్ రెస్పాండర్లు’గా డ్రోన్‌లను ప్రవేశపెట్టామన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో మొదటి నుండి అనుబంధం ఉన్న వ్యక్తిగా, ఇది ఈ రోజు వినియోగంలోకి రావడం వృత్తిపరంగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని డీజీపీ తెలిపారు.

తాను హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు, కేవలం డయల్ 100, డయల్ 108 కాల్‌లను మాత్రమే నిర్వహించే ‘డయల్ 100 ఆపరేషన్స్ సెంటర్’ను కొంపల్లి నుండి TGICCCకి తరలించడానికి, ఇతర అత్యవసర సేవలను అనుసంధానించడానికి బడ్జెట్‌ను కేటాయించామన్నారు. అదే నేటి ఈ వ్యవస్థ రూపాంతరానికి పునాది వేసిందని తెలిపారు. నేరాల నివారణకు డయల్ 112 ఎంతో కీలకమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. దీని ద్వారా వచ్చే కాల్‌లను నిశితంగా పరిశీలించాలని యూనిట్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎమర్జెన్సీ సమయంలో అండగా నిలవాలని అధికారులకు డీజేపీ సూచలను చేశారు.

Also Read : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీగా సర్‌ కోత?…. 60 లక్షల ఓట్లు ఔట్?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.