
Peddi Sudarshan Reddy : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందుతోంది.
సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారన్న వార్త వినగానే బీఆర్ఎస్ వర్గాలు, ఆయన అనుచరులు, నర్సంపేట ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన వరంగల్‌కు బయల్దేరి వెళ్లారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఆయన ఆరోగ్యపరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన కూడా కొద్ది సేపటి క్రితం వరంగల్ బయలుదేరి వెళ్లారు.
సుదర్శన్ రెడ్డి కి గుండెపోటు వచ్చిందని తెలియగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించినట్లు తెలిసింది.
కాగా, ఆయన ఆరోగ్యం విషమించి మృతి చెందారనే ప్రచారం సాగటంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రధాన స్రవంతి మీడియా కూడా ఆయన మరణించినట్లు పేర్కొనడంతో గందరగోళం నెలకొంది. అయితే కొద్ది సేపటి క్రితం ఆయనకు చికిత్స అందిస్తున్న రోహిణి ఆసుపత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయన కోలుకుంటున్నారని వెల్లడించారు. ఆయన మరణించారని వచ్చిన వార్తలు అవాస్తవం అని తేల్చి చెప్పారు. హార్ట్ బీట్ సాధారణ స్థితికి వచ్చిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దు . పెద్దికి చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు









