
Gig And Platform Workers : గిగ్ వర్కర్ల యూనియన్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ఆగస్టు 8 నుంచి తలపెట్టాల్సిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు జేఏసీ ప్రకటించింది. గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్ల నాయకులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. గిగ్ వర్కర్ల డిమాండ్లపై చర్చించారు. ఈ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ అండ్ పార్శిల్ డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న వేతన సమస్యలు, కనీస ఆదాయ భద్రత, బేస్ ప్రైస్ (కనీస ఛార్జీలు) నిర్ణయం వంటి ప్రధాన సమస్యలను వర్కర్ల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గిగ్ వర్కర్ల ప్రయోజనాలు కాపాడేలా బేస్ ప్రైస్ నిర్ణయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల 15 నాటికి నూతన నిబంధనలు తీసుకువస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన ఈ కీలక హామీతో.. శనివారం (ఆగస్టు 8) నుంచి చేపట్టాలని తలపెట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మెను విరమిస్తున్నట్లు తెలంగాణ అగ్రిగేటర్స్ అండ్ డ్రైవర్స్ ఫెడరేషన్ (TADF) ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు.
Also Read : రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి.. పోలీసుల తీరుపై అనుమానాలు?
కాగా, ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్లు, డ్రైవర్లతో నాంపల్లిలో మొదటి సమావేశం ఏర్పాటు చేసిన విషయాన్ని జేఏసీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు, వాహన సేవల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో యాప్ తీసుకొస్తామని నాడు ముఖ్యమంత్రి హామీలు ఇచ్చారని.. వాటిని నెరవేర్చలేదని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతున్నా డ్రైవర్లు, గిగ్ వర్కర్ల సమస్యలు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత జులై నెలలో సమ్మె కూడా చేశామని గుర్తు చేశారు. డ్రైవర్లు, గిగ్ వర్కర్లకు ఆదాయం తగ్గుతోందని.. అన్యాయమైన ఛార్జీలతో ఇబ్బందిపడుతున్నమని వివరించారు. అందుకే తాము సమ్మెకు పిలుపు ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు.
అయితే గిగ్ వర్కర్ల సమస్యలు, యూనియన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. కార్మికుల ప్రయోజనాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన వివరించారు. సమస్యలకు పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే వరకు గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు, యూనియన్లు ఓపికగా ఉండాలని మంత్రి కోరారు. కార్మికులకు మేలు జరిగేలా అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామని వివేక్ హామీ ఇచ్చారు. కాగా మంత్రి వివేక్‌తో జరిగిన చర్చలపై గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల యూనియన్ల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ శనివారం( ఆగస్టు 8) నుంచి చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
Also Read : నా మొగున్ని చంపుతావా? లేక నన్ను చావామంటావా?









