
Telangana Rains : గోదావరి నది భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టు వైపు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగులుగా ఉన్న నీటిమట్టం, శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడవ (చివరి) ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శనివారం ఉదయానికి గోదావరి నీటిమట్టం ఏకంగా 55.1 అడుగులకు చేరుకుంది.
వరద తీవ్రత నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఉప్పొంగుతున్న వాగులు దాటకుండా కట్టుదిట్టమైన భందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరద ఉద్ధృతి కారణంగా దుమ్ముగూడెం-భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచే వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.దుమ్ముగూడెం మండలంలోని చారిత్రాత్మక పర్ణశాల వద్ద ఉన్న స్నానఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. సీతవాగు పొంగి పొర్లుతుండటంతో సీతమ్మ నారచీరల ప్రాంతం, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జి నీటిలో మునిగిపోయాయి. మరోవైపు తూరుబాక వద్ద ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై ఇటీవల నిర్మించిన హైలెవెల్ వంతెన అప్రోచ్ రోడ్లు ఇరువైపులా కోతకు గురై ప్రమాదకరంగా మారాయి.
చర్ల మండలంలోని వీరాపురం శివారు ఇసుక క్వారీని ఎగువ నుంచి ఉన్నట్టుండి వచ్చిన వరద చుట్టుముట్టడంతో దాదాపు 44 మంది లారీ డ్రైవర్లు, స్థానికులు చిక్కుకుపోయారు. అధికారులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినప్పటికీ, 30కి పైగా లారీలు క్వారీలోనే ఉండిపోయాయి. వీరిని రక్షించేందుకు తెప్పపై వెళ్లిన సీఐ రాజువర్మ, ఎస్సై నర్సిరెడ్డి వరద నీటిలో పడిపోయినప్పటికీ, ఈదుకుంటూ తిరిగి తెప్పపైకి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అశ్వాపురం మండలంలోని బట్టీలగుంపు-రామ్‌నగర్ గ్రామాల మధ్య వరద వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అత్యవసర వైద్య సాయం కోసం ఒక గర్భిణిని ముందస్తు చర్యల్లో భాగంగా థర్మోకోల్ తెప్పపై సురక్షితంగా అవతలికి తరలించారు. భద్రాచలం వద్ద పరిస్థితిని సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్యం , విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని పరిశీలించేందుకు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు శ్రీరాంసాగర్, కడెం , పార్వతి పంప్‌హౌస్‌లలో పర్యటించనున్నారు.
Also Read : మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు.. ట్విస్ట్ ఏంటంటే?
ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురిసిన ఏకధాటి వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తలమడుగు మండలంతో పాటు రుయ్యాడ, కప్పర్‌దేవి గ్రామాల్లోని రైతుల పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వర్షాలు లేక ఇబ్బంది పడుతూ ఎలాగోలా పంటలను కాపాడుకున్న రైతులను ఈ అకస్మాత్తు వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4,634 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, అత్యధికంగా తలమడుగు మండలంలో 153 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఎల్‌నినో ప్రభావం వల్ల జూలై చివరి వారం వరకు రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు కనిపించినా, ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, చురుకైన రుతుపవనాల వల్ల వర్షాలు పుంజుకున్నాయి. జూన్ 1 నుంచి జులై 31 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 349.9 మి.మీ కాగా, 332.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే కేవలం 5 శాతం మాత్రమే తక్కువ అని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే, దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే వర్షపాతం ఎక్కువగా నమోదైంది.
రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఇప్పటికీ వర్షపాత లోటు తీవ్రంగా ఉంది. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా సాధారణం కంటే 52% ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, కామారెడ్డిలో 35%, ములుగులో 32% అదనంగా కురిసింది. మరోవైపు, యాదాద్రి జిల్లాలో సాధారణం కంటే 47% తక్కువ వర్షపాతం నమోదై చిట్టచివరి స్థానంలో నిలిచింది. అలాగే జనగామ (-41%), నల్గొండ (-38%), వరంగల్ (-36%), నిర్మల్, హనుమకొండ, గద్వాల జిల్లాల్లో (-34%) వర్షపాత లోటు స్పష్టంగా కనిపిస్తోంది.జూలై 26 నాటికి రాష్ట్రంలో 397 మండలాల్లో లోటు, 51 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదవగా, జూలై చివరి నాటికి పరిస్థితులు మారాయి. వర్షాలు కురవడంతో తీవ్ర లోటు ఉన్న మండలాలు 14కు తగ్గగా, 234 మండలాల్లో లోటు, 253 మండలాల్లో సాధారణం, 106 మండలాల్లో అధిక వర్షపాతం రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌లో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడమే కాకుండా 96 మండలాల్లో భారీ వర్షాలు కురిసాయి.
రాబోయే ఐదు రోజులకు వాతావరణ హెచ్చరికలు
ప్రస్తుతం వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారి మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్ వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పాటు రాజస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్న రుతుపవనాల ద్రోణి కారణంగా తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో పలు ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read : LRS గడువు పెంపు.. మరో నాలుగు నెలలు టైమ్ !









