
DJ Sound : వినాయక నిమజ్జనం అంటే డ్యాన్సులు, పాటలు, డీజేలు.. సందడి మామూలుగా ఉండదు. కానీ ఆ సందడి ఒక్కోసారి హద్దులు దాటుతోంది. చెవులు చిల్లులు పడేంత శబ్దంతో డీజేలు మోగుతుంటే.. గంటల తరబడి వాటి ముందు యువత డ్యాన్స్ చేస్తోంది. తాజాగా ఏపీలో వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే శబ్దాల మధ్య పలువురు అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. దీంతో అసలు డీజే సౌండ్ ఎంత వరకు ఉండాలి ఎంతసేపు ఆ శబ్దంలో ఉండొచ్చు అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.
మన దేశంలో శబ్దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ఈ పరిమితులు మారుతాయి. ఇళ్లున్న ప్రాంతాల్లో పగటి సమయంలో పరిసరాల్లో సగటు శబ్దం 55 డెసిబెల్స్‌కు మించకూడదు. రాత్రి సమయంలో ఇది 45 డెసిబెల్స్‌గా ఉంటుంది. ఆసుపత్రులు, స్కూళ్లు వంటి సైలెన్స్ జోన్లలో ఇంకా తక్కువ శబ్ద పరిమితి ఉంటుంది. పగటి సమయంలో 50 డెసిబెల్స్, రాత్రి 40 డెసిబెల్స్ వరకు పరిమితి ఉంటుంది. అయితే డీజే బాక్స్‌పై కనిపించే వాల్యూమ్ నంబర్‌ను చూసి ఈ పరిమితిని నిర్ణయించలేం. అధికారులు చుట్టుపక్కల ప్రాంతంలో ఎంత శబ్దం వస్తుందో కొలుస్తారు. అందుకే డీజే నిర్వాహకులు శబ్దాన్ని వీలైనంత తక్కువగా ఉంచడం ముఖ్యం.
Also Read : మమత అభ్యర్థి యూటర్న్.. ఉదయం తప్పుకుని, సాయంత్రానికి మళ్లీ బరిలోకి!
సాధారణంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్స్పీకర్లు, డీజేలు వంటివి ఉపయోగించడంపై నిబంధనలు ఉన్నాయి. కొన్ని పండుగల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇస్తే పరిమిత సమయం వరకు మినహాయింపు ఉండొచ్చు. అందుకే పండుగ పేరుతో ఇష్టమొచ్చినంత సేపు డీజే పెట్టుకోవడం కుదరదు. స్థానిక అధికారులు ఇచ్చిన అనుమతులు, సమయ పరిమితులు తప్పకుండా పాటించాలి.
డీజే శబ్దం విన్న ప్రతి ఒక్కరికీ గుండెపోటు వస్తుందని చెప్పలేం. గుండెపోటుకు చాలా కారణాలు ఉంటాయి. కానీ చాలా పెద్ద శబ్దంలో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరంపై ఒత్తిడి పెరగొచ్చు. రక్తపోటు పెరగడం, నిద్ర సరిగా లేకపోవడం, ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువ శబ్దం వల్ల చెవులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. అందుకే డీజే బాక్సులకు చాలా దగ్గరగా నిలబడటం, గంటల తరబడి భారీ శబ్దం మధ్య డ్యాన్స్ చేయడం మంచిది కాదు. నిమజ్జన ఊరేగింపుల్లో గంటల తరబడి డ్యాన్స్ చేసే యువత కూడా జాగ్రత్తగా ఉండాలి. డ్యాన్స్ చేస్తూ శరీరం అలసిపోయినా ఆపకుండా కొనసాగించడం మంచిది కాదు. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఒక్కసారిగా బలహీనంగా అనిపించడం, చల్లటి చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డ్యాన్స్ ఆపి వైద్య సహాయం తీసుకోవాలి.
డీజే బాక్సులకు నేరుగా ఎదురుగా నిలబడకండి. వీలైనంత దూరంగా ఉండండి. ఎక్కువసేపు అక్కడే ఉండకుండా మధ్య మధ్యలో ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లండి. చెవుల్లో గింగిరాలు తిరగడం, శబ్దం వినిపించడం, చెవులు బ్లాక్ అయినట్లు అనిపించడం మొదలైతే వెంటనే డీజే దగ్గరి నుంచి వెళ్లిపోవాలి. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, గుండె లేదా బీపీ సమస్యలు ఉన్నవారు భారీ శబ్దానికి దూరంగా ఉండటం మంచిది.
Also Read : కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి… ధరలు పెరడగానికి అసలు కారణం ఏంటంటే?









