Hyderabad Rain : హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడింది. సుమారు రెండు గంటల పాటు కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వాన కురుస్తుండటంతో రోడ్లపై నీరు చేరింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, ముషీరాబాద్, నారాయణగూడ ప్రాంతాల్లోనూ వర్షం జోరుగా కురుస్తోంది.

వర్షం కారణంగా నగరంలోని పలు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అలర్ట్ జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, తప్పనిసరిగా ప్రయాణించాల్సి వస్తే నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే రోడ్లలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Also Read : కోకాపేట వేలానికి సింగిల్‌ బిడ్.. రద్దు చేసిన హెచ్‌ఎండీఏ

మరోవైపు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు ఉండొచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తాజా నగర వాతావరణ నివేదికలో పేర్కొన్నారు.

భారీ వర్షాల సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని అధికారులు సూచించారు. వర్షం ఎక్కువగా ఉన్న సమయంలో అవసరం లేకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెప్పారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో వాహనాలను వేగంగా నడపకుండా జాగ్రత్తగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రానున్న రోజుల్లోనూ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ప్రజలు వాతావరణ శాఖ, అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు.

Also Read : ఎల్పీజీ సబ్సిడీ కొనసాగాలంటే ఆధార్‌తో లింక్ తప్పనిసరి.. ఇంట్లో నుండే ఇలా చేసుకోండి..

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.