food

Hyderabad:  మనం తినే అన్నం, చివరకు చిన్న పిల్లలు తాగే పాలపొడిలో కూడా కొందరు స్వార్థపరులు విషం కలుపుతున్నారు. కేవలం డబ్బు సంపాదన కోసమే జనం ప్రాణాలతో ఆడుకుంటున్న కల్తీ ముఠాలపై హైదరాబాద్ సిటీ పోలీసులు యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం హెచ్-ఫాస్ట్ సక్సెస్‌ఫుల్‌గా 100 రోజులు పూర్తి చేసుకుంది. జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈ టీమ్ నగరంలో ఎక్కడికక్కడ దాడులు చేస్తోంది.

పూర్వం మన పెద్దవాళ్లు మంచి ఆహారం తిని నూరేళ్లు హ్యాపీగా బతికేవారు. కానీ ఇప్పుడు కల్తీ తిండి వల్ల చిన్న వయసులోనే క్యాన్సర్, కిడ్నీల నొప్పులు, గుండె జబ్బులు వస్తున్నాయి. చిన్న పిల్లల ఎదుగుదల కూడా ఆగిపోతోంది. దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఆసుపత్రుల పాలై అప్పులలొ కూరుకుపోతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన ఆహారం అందించడమే ఈ హెచ్-ఫాస్ట్ బృందం ముఖ్య ఉద్దేశం.

ఈ 100 రోజుల్లో పోలీసులు 185 కేసులు నమోదు చేసి, సుమారు 121 టన్నుల కల్తీ ఆహారాన్ని పట్టుకున్నారు. రాజేంద్రనగర్, గోల్కొండ, సికింద్రాబాద్ ఏరియాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. పోలీసులు పట్టుకున్న వాటిలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కెమికల్స్ కలిపిన 27 వేల కేజీల నకిలీ పేస్ట్‌ను పట్టుకున్నారు. హోటళ్లకు సప్లై చేసేందుకు దాచిన 60 టన్నుల చికెన్ వ్యర్థాలను సీజ్ చేశారు. మందులు వేసి మగ్గబెట్టిన 25 వేల కేజీల పండ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నకిలీ టీపొడి, కల్తీ నెయ్యి, కోవా, పచ్చళ్లు, పెరుగు, పనీర్‌లను భారీగా పట్టుకున్నారు. హోటళ్లు, హాస్టళ్లు, బేకరీలపై కూడా నిఘా పెట్టారు.

హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులతో పోలీసులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. లాభాల కోసం జనం ప్రాణాలతో ఆడుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వంట చేసేవాళ్లు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు వేసుకోవాలని, పాత స్టాక్‌ను కొత్త దాంట్లో కలపకూడదని చెప్పారు. ముఖ్యంగా వాడిన నూనెను పదే పదే వాడొద్దని రూల్స్ పెట్టారు.

కల్తీ చేయడం అనేది చిన్న తప్పు కాదు, అది ఒక ఘోరమైన హత్యాయత్నంతో సమానం. జనం కిడ్నీలను పాడు చేస్తూ, క్యాన్సర్ లాంటి రోగాలను పంచుతున్న కల్తీ మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ప్రయోగిస్తాం అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ తీవ్రంగా హెచ్చరించారు. మీ చుట్టుపక్కల ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే.. వెంటనే డయల్ 100 కి గానీ, లేదా హెచ్-ఫాస్ట్ వాట్సాప్ నంబర్ 8712661212 కి గానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను సీక్రెట్‌గా ఉంచుతామని చెప్పారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.