
Indiramma Houses : హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా (CURE) పరిధిలో నిరుపేదల కోసం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరంలోని పేదలకు కేవలం నీడ కల్పించడమే కాకుండా, వారి జీవనోపాధికి ఎలాంటి భంగం కలగకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సమీక్షను చేపట్టింది.
నగరానికి దూరంగా, అటవీ లేదా ఖాళీ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమై ఆ ఇళ్లు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే, పేదలు పనిచేసే ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనివల్ల నిరుపేదలు రోజువారీ జీవనోపాధిని కోల్పోకుండా, సౌకర్యవంతమైన జీవనాన్ని సాగించవచ్చని స్పష్టం చేశారు.
అనుకూలమైన స్థలాల కొరతను అధిగమించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల నిరుపయోగ భూములపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ప్రస్తుతం వినియోగంలో లేని స్థలాలను గృహనిర్మాణ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. ఈ స్థలాలకు ప్రత్యామ్నాయంగా సంబంధిత శాఖలకు నగరం వెలుపల వేరే చోట భూములను కేటాయించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా మొదటి విడత కింద క్యూర్ పరిధిలోని 17 కీలక నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్పురా, అంబర్పేట్, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్,మలక్పేట్ నియోజకవర్గాల్లో ఈ ఇళ్లను ప్రాధాన్యత క్రమంలో నిర్మించనున్నారు.
Also Read : నీట్ పేపర్ లీక్ వివాదం: కేంద్రంతో సీజేపీ చర్చలు – ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకే పట్టు!
నగర పేదల కోసం నిర్మించే ఒక్కో ఇందిరమ్మ ఫ్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్త్లీర్ణంతో రూపుదిద్దుకోనుంది. ఇందులో నివాసానికి వీలుగా 400 చదరపు అడుగుల స్పష్టమైన కార్పెట్ ఏరియా ఉండనుంది. గతంలో కట్టి వదిలేసిన ఇరుకైన నిర్మాణాల్లా కాకుండా, ఒక కుటుంబం సౌకర్యవంతంగా జీవించడానికి తగినట్లుగా డిజైన్లను సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆర్థిక పంపిణీ వివరాలను వెల్లడిస్తూ, ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి సుమారు రూ. 11 లక్షలు ఖర్చవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నేరుగా రూ. 5 లక్షల సబ్సిడీని సాయంగా అందిస్తుంది. మిగిలిన రూ. 6 లక్షల వ్యయాన్ని లబ్ధిదారుడి వాటాగా నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన బ్యాంకు రుణ సౌకర్యాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
నగర పరిధిలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో లబ్ధిదారులపై ఎలాంటి భార పడకుండా స్థలానికయ్యే పూర్తి వ్యయాన్ని (Land Cost) ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అత్యంత విలువైన కోర్ అర్బన్ ప్రాంతాల్లోని స్థలాలను ఉచితంగా కేటాయించడం ద్వారా నిరుపేదలకు కోట్ల విలువైన ఆస్తిని సమకూర్చినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సమీక్ష ముగింపు సందర్భంగా, ప్రతిపాదిత 17 నియోజకవర్గాల్లో నిరుపయోగంగా ఉన్న ఖాళీ భూములను సత్వరమే గుర్తించే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగరంలోని అర్హులైన నిరుపేదలందరికీ త్వరలోనే స్వంత ఇంటి కలను నిజం చేస్తామని, ప్రజా ప్రభుత్వంలో పేదల ఆకాంక్షలకే మొదటి ప్రాధాన్యమని సీఎం పునరుద్ఘాటించారు.
Also Read : ఇందిరాపార్క్ వేదికగా బీఆర్ఎస్వీ ధర్నాకు అనుమతి, కేటీఆర్ హాజరు!









