
KCR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.
ఈ సమావేశంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నారని, అలాంటి వారితో చర్చించేందుకు తాను అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. నేను అసెంబ్లీకి రావాలా..? వద్దా..? మీరే చెప్పండి అంటూ పార్టీ నేతలను అడిగారు. తన చావు కోరుతూ పదేపదే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన అని విమర్శించారు. తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని, స్పీకర్ పక్షపాత వైఖరి చూపిస్తే దాన్ని కూడా అసెంబ్లీలోనే ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో నీటి సమస్యపై కూడా కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. త్వరలో నీళ్ల కోసం పాదయాత్ర చేపడతానని చెప్పారు. లక్ష మంది రైతులతో కలిసి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సందర్శిస్తానని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కు సంఖ్యాబలమే ముఖ్యమని కేసీఆర్ అన్నారు. అందుకే ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఏ అంశాలపై నిలదీయాలి, ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావించాలి అనే దానిపై ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
Also Read : నేను బెదిరిస్తే భయపడను.. పాతబస్తీలో సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!









