Khairatabad Ganesh :హైదరాబాద్‌లో వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చే పేరు మాత్రం ఖైరతాబాద్ బడా గణేష్. భారీ విగ్రహం, ప్రతి ఏడాది మారే రూపం, వేలాది మంది భక్తుల సందడి.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ గణపతిని నగరంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టాయి. అసలు ఖైరతాబాద్ గణేష్‌కు ఇంత పేరు ఎలా వచ్చింది? ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైంది? మొదట్లో విగ్రహం ఎంత చిన్నగా ఉండేది? ఇప్పుడు ఎందుకు అంత పెద్దగా తయారు చేస్తున్నారు? 2026లో బడా గణేష్ ప్రత్యేకత ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే దాదాపు 70 ఏళ్ల వెనక్కి వెళ్లాలి.

ఖైరతాబాద్ బడా గణేష్ చరిత్ర 1954లో మొదలైంది. అప్పట్లో స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కార్పొరేటర్ సింగరి శంకరయ్య ఖైరతాబాద్‌లో వినాయక ఉత్సవాలను ప్రారంభించారు. మొదటి ఏడాది కేవలం ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పట్లో ఎవరికీ తెలియదు.. చిన్నగా మొదలైన ఈ గణపతి ఉత్సవం భవిష్యత్తులో హైదరాబాద్‌కు ఇంత పెద్ద గుర్తింపుగా మారుతుందని. ఆ తర్వాత ప్రతి ఏడాది విగ్రహం ఎత్తును ఒక్కో అడుగు చొప్పున పెంచుతూ వచ్చారు. అలా సంవత్సరాలు గడిచేకొద్దీ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం భారీగా మారింది. 2014 నాటికి 60 అడుగుల ఎత్తుకు చేరుకుంది. తర్వాత పర్యావరణ సమస్యలు, నిమజ్జనం సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు వంటి కారణాలతో కొంతకాలం ఎత్తును తగ్గించారు. అయినా భక్తుల నుంచి వస్తున్న ఆదరణతో మళ్లీ భారీ విగ్రహాల సంప్రదాయం కొనసాగింది. గణపతితో పాటు పక్కన ఉండే దేవతల విగ్రహాలు, భారీ అలంకరణలు, పండల్ డిజైన్ కూడా భక్తులను ఆకట్టుకుంటాయి.

ఈ భారీ విగ్రహాన్ని తయారు చేయడానికి నెలల ముందే పనులు మొదలవుతాయి. వందలాది మంది కళాకారులు, కార్మికులు కలిసి పగలు రాత్రి పనిచేస్తారు. 2026 విగ్రహం కోసం దాదాపు 150 మంది కళాకారులు సుమారు మూడు నెలల పాటు పనిచేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 2026లో ఖైరతాబాద్ బడా గణేష్ 69 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ ఏడాది గణపతిని పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో ఏర్పాటు చేశారు. అంటే ఐదు ముఖాలతో గణపతి దర్శనమిస్తున్నాడన్నమాట. ఇదే ఈ ఏడాది విగ్రహానికి ప్రధాన ప్రత్యేకత.

ఖైరతాబాద్ గణేష్‌ను చూడటానికి హైదరాబాద్ నగరం నుంచే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. గణపతిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని ఎంతోమంది భక్తులు నమ్ముతారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో నిమజ్జనం కూడా ప్రత్యేక ఆకర్షణ. పూజలు పూర్తయిన తర్వాత భారీ ఊరేగింపుగా గణపతిని హుస్సేన్ సాగర్ వైపు తీసుకెళ్తారు. భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి క్రేన్లు, ప్రత్యేక వాహనాలు ఉపయోగిస్తారు. 2026లో ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి సందర్భంగా జరగనుంది.

ఖైరతాబాద్ బడా గణేష్ అంటే కేవలం ఒక భారీ విగ్రహం కాదు.. 70 ఏళ్లకు పైగా చరిత్ర, తరతరాల భక్తి, హైదరాబాద్ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన భాగం. అందుకే బడా గణేష్‌కు ప్రతి ఏడాది అదే స్థాయిలో క్రేజ్ కొనసాగుతోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.