Komatireddy Rajagopal Reddy : అవకాశం దొరికినప్పుడల్లా తనకు మంత్రిపదవి రాలేదని సీఎం రేవంత్‌ రెడ్డి ని విమర్శించే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఒక్కసారిగా మాటమార్చారు. కొండా సురేఖ పడిన వేటు కారణమా? లేక మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న సంకేతాలతో సీఎంతో సఖ్యతగా ఉంటే మంత్రి పదవి వస్తుందన్న నమ్మకమో? ఏమోకానీ ఆయన ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి బుద్ధి లేదు.. ఆయనను పార్టీలోకి తీసుకున్న రేవంత్ రెడ్డికి బుద్ధి లేదంటూ విమర్శలు సంధించడమే కాకుండా పలుమార్లు పార్టీ, ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన ఎప్పటికప్పుడు రేవంత్‌ సర్కార్‌పై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ హాట్ టాపిక్‌గా నిలిచిన ఆయన ఒక్కసారిగా మెత్తబడ్డారు.

కొండా సురేఖను బర్తరఫ్‌ చేసిన తర్వాత నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నోటిని కొంత కంట్రోల్‌ చేసినట్లు కనిపిస్తోంది. అంతేకాదు సీఎం రేవంత్‌ రెడ్డిని తానేప్పుడు దూషించలేదంటూ చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

సీఎం రేవంత్‌ రెడ్డి నల్గొండ జిల్లా నకిరేకల్‌ పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని నేనెప్పుడూ దూషించలేదని.. ఒకటి, రెండు అంశాల్లో మాత్రమే విభేదించానని చెప్పుకోచ్చారు. అంతేకాదు రేవంత్ రెడ్డితో నాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఇంకా కీలక అంశం ఏంటంటే గతంలో తన నియోజకవర్గానికి నిధులు రావడం లేదన్న ఆయన ఈ రోజు మాత్రం కొడంగల్, మధిర స్థాయిలో నా నియోజకవర్గానికి నిధులు వచ్చాయని చెప్పుకోవడం గమనార్హం. మునుగోడుకు రూ.2 వేల కోట్ల నిధులు వచ్చాయని ఆయన తెలిపారు. అంతేకాదు సీఎం సభకు వేలాది మంది కార్యకర్తలతో వెళ్తానని సెలవిచ్చారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధిష్టానానిదే ఫైనల్ నిర్ణయం అంటూ చెప్పడం ఆసక్తిగా మారింది.

సీఎం రేవంత్‌ రెడ్డిపై కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇటీవల ఆమె కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారడం, కాంగ్రెస్‌ అధిష్టానం ఆమెను బర్తరఫ్‌ చేయడంతో ఆ ప్రభావం సీఎం ను విమర్శిస్తున్న వారిపై తీవ్రంగానే పడినట్లు తెలుస్తోంది. సీఎం ను విమర్శిస్తే చర్యలు తప్పవన్న సంకేతాలు వెలువడటం తో రాజగోపాల్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకున్నాడన్న ప్రచారం సాగుతోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.