
Konda Murali : తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన మాజీమంత్రి కొండ సురేఖ బర్తరఫ్ వ్యవహారం తర్వాత తొలిసారి ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తొలిసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బర్తరఫ్ సందర్భంగా ‘‘కొండా సురేఖను సారీ అని ఒక్క మాట చెప్పమన్నారు. కానీ, నా పదవి ఉంటే ఉండనీ.. పోతే పోనీ అని సారీ మాత్రం చెప్పనని ఆమె చెప్పలేద’ని వెల్లడించారు. ‘‘పదవులు మాకు కొత్త కాదు. ఇవాళ వస్తాయి.. రేపు పోతాయి. కానీ, మాట కోసం నిలబడతాం. కృతజ్ఞత అనేది మా రక్తం, మా కుటుంబంలో ఉందని మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని రోజులు బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం’’ అని కొండా మురళి స్పష్టం చేశారు.
ఇక కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు వస్తున్న ప్రచారంపై కూడా కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా, బర్తరఫ్ తర్వాత వరంగల్‌లో తమ కార్యకర్తలతో కొండా దంపతులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొండా సురేఖను గెలిపించడంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పాత్ర ఉందన్న కొండా మురళి, ఆయనను ప్రధానిని చేయడమే మా లక్ష్యం. మాట కోసం నిలబడతాం అని మురళి వ్యాఖ్యానించారు.
పదవుల మీద తమకు వ్యామోహం లేదని, మాట కోసం నిలబడతామని పదవులు ఇవాళ వస్తాయి.. రేపు పోతాయని ఆయన ఉద్ఘాటించారు. నా శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయి. బుల్లెట్లున్నా ఇంకా నేను బతికే ఉన్నా. కొండా సురేఖది నాది ఒక్కటే మాట అని స్పష్టం చేశారు. మా బిడ్డది మాత్రం వేరే మాట, వేరే బాట తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్ కష్టాల నుంచి వచ్చినవారేనని చెప్పుకొచ్చారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ తిరుగుతాం. గెలుపు గుర్రాలకు టికెట్లు మేమే ఇస్తామని కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మేము ఇంట్లో కూర్చోనేవాళ్లం కాదు జాగ్రత్త..కొండా సురేఖ
ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ తాను వరంగల్ తూర్పులోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎవరికి ఆపదొచ్చినా అండగా ఉంటా. ఏ పార్టీలోకి వెళ్ళేది లేదు, ఆ ఆలోచనే లేదు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి, పెరిగాం..ఇందులోనే ఉంటామని తేల్చి చెప్పారు. కొన్ని కారణాలతో వైఎస్సార్సీపీ, టిఆర్ఎస్ లోకి వెళ్ళాము. మా అంతటా మేము టీఆర్ఎస్ వీడలేదన్నారు. ఇప్పుడు మాట్లాడే నేతలంతా పదవుల కోసం పార్టీలు మారినవారెనన్నారు. మేము అధికార పార్టీల నుండి ప్రతిపక్ష పార్టీలకు వెళ్ళామని గుర్తు చేశారు.
గుండు సుధారాణికి కుడా ఛైర్ పర్సన్ పదవి ఇచ్చేందుకు మేమే లేఖ రాశాము. పదవి వచ్చాక కనీసం మాతో మాట్లాడలేదు. మేము రాజీనామా చేస్తే పోటీకి సిద్ధమని సారయ్య ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన కార్పొరేటర్ మీద గెలిచి చూపెట్టమని ఛాలెంజ్ చేశారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని కోసం కొండా మురళీ సహాయం చేశారు. వినయ్ భాస్కర్ ను తట్టుకోలేక కొండా మురళిని ప్రాధేయపడ్డాడు. మా సహాయం తీసుకొని ఇప్పుడు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారని ఎద్దేశా చేశారు. మాపై మాట్లాడేవాళ్ళు జాగ్రత్త. మాకు పదవులు ఉన్నా, లేకున్నా ఒక్కటే. మేము ఇంట్లో కూర్చునే వాళ్ళం కాదు, జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు.
పరకాలలో ఎమ్మెల్యే చేయలేని పని నేను చేశాను. తండాలకు కావలసిన 7.5కోట్ల జీవో నేను తీసుకొచ్చాను. మాకు అధిష్టానం నుండి ఫోన్లు వస్తున్నాయి. ఏ పార్టీలోకి వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము కూడా ఎక్కడికీ వెళ్ళేది లేదని చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారి కోసం పోరాటం చేస్తాం. వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ టికెట్ కొండా సురేఖ దేనని తేల్చి చెప్పారు. బీసీ మహిళల్లో సీనియర్ నేనే అని సురేఖ తెలిపారు. 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచా, వచ్చే రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.









