Konda Sushmita : భుధవారం మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా పరకాల నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ లో కలకలం రేపాయి. కాగా దీన్ని ఖండిస్తూ పీసీసీ సురేఖకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సందర్భంగా కొండా సురేఖ సైతం ఆ నోటీసులకు సమాధానం ఇస్తూ సుస్మిత వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీకి లేఖ కూడా రాశారు.

ఇదిలా ఉండగా ఈ విషయమై కొండా సుస్మిత మరోసారి స్పందించారు. ఈ సందర్భంగా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.సురేఖకు నోటీసులు ఇవ్వడంపై రియాక్టైన సుస్మిత తన వ్యాఖ్యలతో కొండా సురేఖకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అంతేకాక తను ఒక వ్యక్తిని, ఓ కుటుంబాన్ని ఉద్దేశించి మాత్రమే మాట్లాడానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద వ్యవస్థ- అన్న సుస్మిత రాహుల్, సోనియా అంటే తనకు గౌరవం ఉందని చెప్పుకున్నారు.రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజం అన్న సుస్మిత తల్లితోనైనా అభిప్రాయ భేదాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. కాగా రేవంత్‌పై సుస్మిత కామెంట్స్‌తో కాంగ్రెస్ నేతల మండిపడుతున్నారు.

కాగా, కొండా సురేఖ సమాధానంతో పీసీసీ సంతృప్తి చెందుతుందా లేదంటే ఆమెపై చర్యలకు ముందుకు వెళ్లుందా అనేది ఇపుడు ఉత్కంఠ రేపుతోంది. సుస్మితకు పార్టీలో ఎలాంటి సభ్యత్వం లేకపోవడం మూలంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో సురేఖను టార్గెట్ చేయాలని భావించిన నేతలకు చుక్కెదురైంది. సుస్మిత వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, సంబంధం లేని విషయాల్లో చర్యలు ఎలా తీసుకుంటారని సురేఖ టీపీసీసీ నేతలకు కౌంటర్ అటాక్ ఇవ్వడం వారికి మింగుడు పడటం లేదు. కాగా, గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖ మధ్య సాగుతున్న ఆరోపణల పర్వం ఈసారి సుస్మిత ఎంట్రీతో మరోసారి రచ్చకెక్కిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.