
Voter List SIR 2026 : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో సుమారు 60 లక్షల మేర ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్న అధికారుల ప్రాథమిక అంచనాలు చర్చనీయాంశంగా మారాయి. ఓటరు జాబితాలో నమోదైన చిరునామాల్లో దాదాపు 40 లక్షల మంది అందుబాటులో లేకపోవడం, మరో 5 లక్షల మంది మరణించినవారు, డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు తెలుస్తున్నది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగిన 15 లక్షల మంది వారి సొంత రాష్ట్రాల్లోనే ఓటు నమోదుకు ఆసక్తి చూపుతున్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే సర్ ప్రక్రియ పూర్తయి ఫైనల్ జాబితా వస్తేనే అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా, ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఆగస్టు 10వ తేదీ వరకు గడువు ఉండటంతో అధికారులు సర్ ప్రక్రియ పనులను వేగవంతం చేశారు. సర్వే మందకొడిగా సాగుతున్న గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న సర్ ప్రక్రియలో అడ్రస్‌లు దొరక్కపోవటం ఆందోళనకరమైన అంశంగా మారింది. ఓటరు ఐడీ రికార్డుల్లో నమోదు చేసిన అడ్రస్‌లలో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు అందుబాటులో లేరని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో ఉపాధి, వ్యాపారాల నిమిత్తం వేరే ప్రాంతాలకు మారిన వారు, పక్క రాష్ట్రాలకు వెళ్లిన ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఒకే వ్యక్తికి రెండు, మూడు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉండటం లేదా స్వగ్రామంతో పాటు హైదరాబాద్‌లోనూ ఓటు ఉండటం వంటి లోపాలను సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులు తొలగిస్తున్నారు. చనిపోయిన వారి పేర్లను సైతం తీసేస్తున్నారు. చనిపోయిన వారు, డూప్లికేట్ ఓట్లు కలిగిన వారు దాదాపుగా 5 లక్షల మంది వరకు ఉంటారని తెలుస్తున్నది.
Also Read : రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 52 కాలేజీల గుర్తింపు రద్దు?
ఉపాధి, ఉద్యోగాల కోసం దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి హైదరాబాద్ సహా ఇతర జిల్లాలకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోయిన సెటిలర్లు ఇప్పుడు తమ సొంత రాష్ట్రంలో ఓటు నమోదుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. సర్ ప్రక్రియలోని నిబంధనలు, రాబోయే రాజకీయ సమీకరణాలు, సొంత ఊరితో ఉన్న అనుబంధం నేపథ్యంలో తమ ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్‌లో ఉంచుకునేందుకు మెజార్టీ ప్రజలు సిద్ధపడుతున్నట్టు సమాచారం. దీంతో సెటిలర్లు ఎన్యూమరేషన్ పత్రాలు తీసుకోవట్లేదని తెలుస్తున్నది. సెటిలర్ల నిర్ణయాలతో రాష్ట్రంలో దాదాపు 15 లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలుపుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిలర్ల ఓట్లలో భారీ తగ్గుదల కనిపిస్తున్నదని సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు కోటి 14 లక్షలు కాగా, కేవలం ప్యూర్ జీహెచ్ఎంసీ కార్పొరేషన్ పరిధిలోనే దాదాపు 90 లక్షల దాకా ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తం ఓటర్లలో దాదాపు 15 శాతం నుండి 20 శాతం వరకు ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నవారేనని రాజకీయ పార్టీల అంతర్గత సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య అత్యధికమని తెలుస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 80 శాతం దాకా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో పనులు మందకొడిగా సాగుతున్నాయి. భారీ సంఖ్యలో ఓటర్లు ఉండటం, హైరైజ్ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలోకి అధికారుల ప్రవేశానికి నిబంధనలు అడ్డురావడం, అడ్రస్‌లు మారడం ఇందుకు ప్రధాన కారణాలుగా మారాయి. అయితే సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సమర్పించడానికి ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం బూత్ లెవెల్ అధికారులు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలను సరిచూస్తున్నారు. ఇంకా దరఖాస్తులు ఇవ్వని వారు వెంటనే స్పందించాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న 60 లక్షల తొలగింపుల సంఖ్య ప్రాథమిక అంచనా మాత్రమేనని, పరిశీలనలో ఉన్న దరఖాస్తుల ప్రక్రియ పూర్తయితే గానీ తుది గణాంకాలు స్పష్టపడవని అధికారులు క్లారిటీ ఇస్తున్నారు.
Also Read : డయల్ 100 రద్దు… ఎమర్జెన్సీ సర్వీసులకు డయల్ 112









