
Telangana : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. క్రమశిక్షణ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి తామందరం కట్టుబడి ఉంటామని స్పష్టం చేసిన ఆయన, తాను ఎప్పుడూ పార్టీకి లేదా సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడలేదని తేల్చిచెప్పారు. పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడానని, పార్టీని బలహీనపరిచే విధంగా తన వ్యాఖ్యలు ఎప్పుడూ లేవని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ అందరి ప్రధాన లక్ష్యమని, పార్టీ బలోపేతం కోసం తాను మాట్లాడిన మాటల వల్లే ఇందిరమ్మ ఇండ్ల నిబంధనల్లో మార్పులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.
అభివృద్ధి నిధుల కోసమే తాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశానని, అదే సమయంలో అక్కడ ఎదురుపడిన కొండా మురళి రాకకు తనకు ఎలాంటి సంబంధం లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై ఆంధ్ర మీడియా పెత్తనం ఎక్కువైందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాలాంటి నికార్సయిన నేతను ఆంధ్ర మీడియా కంట్రోల్ చేయలేదని, తెలంగాణలో కొన్ని ఛానెల్స్ తనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : మంత్రి వర్గం నుంచి సురేఖ ఔట్?… వరంగల్ తూర్పులో హై టెన్షన్..
తనపై తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన ఆయన, తను తలుచుకుంటే వంద పేపర్లు, ఛానెళ్లు పెట్టగలనని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, తాను పార్టీకి కట్టుబడి ఉన్నామని చెబుతూనే, మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండించారు.
మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన అనంతరం మంత్రి కొండా సురేఖ భర్త, సీనియర్ నేత కొండా మురళి మీడియాతో మాట్లాడారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. తమ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఎవరి ప్రభావంతోనో కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయాల మేరకే మాట్లాడిందని తెలిపారు.
పార్టీలో క్రమశిక్షణా కమిటీ ఇచ్చే నిర్ణయం లేదా విచారణ ముగిసే వరకు తాను దీనిపై మళ్లీ ఎలాంటి వ్యాఖ్యలు చేయనని కొండా మురళి స్పష్టం చేశారు. కేవలం ఒక అధికారిక బిల్లు మరియు అభివృద్ధి పనుల విషయమై చర్చించేందుకే తాము డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశామని ఆయన వెల్లడించారు.
Also Read : టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్..? హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి..









