
MLA Mandula Samuel : నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిపై తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో సామేలు విలేకరుల సమావేశం నిర్వహించి కోమటిరెడ్డి సోదరులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సామేలు అత్యంత ఘాటుగా స్పందించారు. “నా నియోజకవర్గంలోకి వచ్చి తిరిగే ధైర్యం, దమ్ము నీకు ఎక్కడిది?” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. తుంగతుర్తి నియోజకవర్గంపై పెత్తనం చెలాయించాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Also Read : సిక్ లీవ్స్ ఇవ్వరు.. వాష్‌రూమ్ వెళ్లనివ్వరు.. టెక్ మహీంద్రాపై హైదరాబాద్ టెకీ ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నడిచే వ్యవస్థ అని స్పష్టం చేసిన సామేలు, “కాంగ్రెస్ పార్టీ ఎవరి తొత్తు కాదు, ఎవరి జేబు సంస్థ అసలే కాదు” అని తేల్చి చెప్పారు. తామే మందుల సామేలును నిలబెట్టి గెలిపించామని కోమటిరెడ్డి వర్గీయులు అహంకారంతో మాట్లాడటాన్ని తప్పుపడుతూ, అలాంటి మాటలు ఇకనైనా బంద్ చేయాలని ఘాటుగా విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత రాజకీయాలను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నువ్వు బీజేపీ నుంచి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి వచ్చావు” అని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన దద్దమ్మవు అని, ఆ తర్వాతే తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చి ఇక్కడి కార్యకర్తల దయాదాక్షిణ్యాల మీద గెలిచావనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.
తాము బడుగు, బలహీన వర్గాలకు చెందినవారమని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. “మా నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గంలో నాకున్న హక్కులను మీరు కాలరాస్తున్నారు” అని ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోమటిరెడ్డి సోదరులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని విమర్శించిన సామేలు, ముందుగా మీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తుంగతుర్తి జోలికి రాకుండా నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల అభివృద్ధి కోసం, అక్కడి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తే మంచిదని ఘాటుగా సూచించారు.
విలేకరుల సమావేశం ముగింపులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. “మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పిచ్చి లేచింది, మెంటల్ లేచింది” అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్, హక్కులను ఉల్లంఘిస్తూ రాజకీయం చేస్తే తగిన బుద్ధి చెప్తానని ఎమ్మెల్యే మందుల సామేలు ఈ సందర్భంగా హెచ్చరించారు.
కోమటిరెడ్డికి ఎస్సీ నియోజకవర్గాలంటే చిన్నచూపని, మాదిగలపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. మాదిగలు ఎవరికీ బానిసలు కాదని స్పష్టం చేసిన ఆయన, ఇదే తరహా పద్ధతి కొనసాగితే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ గౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, అంతకు అంత ప్రతికారం తీర్చుకుంటామని సామేల్ హెచ్చరించారు. “మా జోలికొస్తే మీ రాజకీయ సమాధికి మేమే డప్పులు కొడతాం, మా దండోరా మోగుతుంది. అహంకార పూరితమైన రాజకీయాన్ని చావుదెబ్బ తీస్తాం” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా ఎవరి రాజ్యమూ కాదని, ఇది శ్రమజీవుల జిల్లా అని స్పష్టం చేస్తూ, తనతో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజల అభిమానంతోనే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టామని తేల్చి చెప్పారు.
Also Read : టెట్ నోటిఫికేషన్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్ ఇవే!
వివాదం ఎలా మొదలైందంటే ?
ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంగా వర్గపోరు తీవ్రరూపం దాల్చింది. స్థానిక శాసనసభ్యుడు మందుల సామేలు, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కోమటిరెడ్డి బ్రదర్స్) ల మధ్య తలెత్తిన విభేదాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం కూడా ఆరోపిస్తోంది.
ఈ క్రమంలోనే ఇటీవల మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో మాజీ ఎంపీటీసీ ఎలుగు యాదయ్య కుమారుడు చనిపోగా ఆయన కుటుంబాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే ప్రోటోకాల్ పాటించకుండా తన నియోజకవర్గంలో పర్యటించడాన్ని సామేలు తప్పు పడుతున్నారు. అలాగే వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకం, స్థానిక నాయకత్వ ఎంపిక విషయంలో జోక్యం చేసుకుంటున్నారని సామేలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తలెత్తిన వివాదాలపై టీపీసీసీ నేత జగ్గారెడ్డి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా ఈ ఘటనలపై ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించి కోమటిరెడ్డి బ్రదర్స్‌ను విమర్శించడంతో విభేదాలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి.









