
LPG Cylinder eKYC : తెలంగాణలోని వంటగ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) కీలక హెచ్చరిక జారీ చేశాయి. గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ (LPG) గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈ నెల 16వ తేదీలోగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశాయి. బోగస్, డూప్లికేట్, సుదీర్ఘకాలంగా వినియోగంలో లేని కనెక్షన్లను గుర్తించి తొలగించడమే లక్ష్యంగా కేంద్ర పెట్రోలియం శాఖ ఈ బయోమెట్రిక్ అనుసంధానాన్ని చేపడుతోంది. ఈ గడువు ముగిస్తే సబ్సిడీ ప్రయోజనాలు నిలిచిపోవడమే కాకుండా, రీఫిల్ బుకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందనే ప్రచారంతో రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులు ఏజెన్సీల వైపు పరుగులు తీస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.50 కోట్ల గృహ గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 60 నుండి 70 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ప్రతి ఏటా ఒకసారి ఈ-కేవైసీ ఇవ్వకపోతే, ఏడాదికి సంబంధించి వారికి అందాల్సిన సబ్సిడీలను నిలిపివేస్తామని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే రాబోయే సబ్సిడీలను శాశ్వతంగా రద్దు చేస్తామని తేల్చి చెప్పాయి. అయితే, కేవైసీ చేయకపోవడం వల్ల సబ్సిడీ రాకపోయినప్పటికీ, పూర్తి నిర్దేశిత ధర చెల్లించి సిలిండర్ తీసుకునే వెసులుబాటు (గ్యాస్ సరఫరా/రీఫిల్ బుకింగ్) ఉంటుందని ఆయిల్ కంపెనీలు వివరణ ఇచ్చాయి.
ఈ-కేవైసీ నిర్వహణ ప్రక్రియ క్షేత్రస్థాయిలో అనేక ఆటంకాలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అలాగే హైదరాబాద్, ఇతర పట్టణాల నుంచి అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలకు వెళ్లిన విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల పేర్లపై ఉన్న కనెక్షన్లకు బయోమెట్రిక్ నమోదు సాధ్యపడటం లేదు. అసలు కనెక్షన్ దారులు అందుబాటులో లేకపోవడంతో, ఇంట్లో ఉంటున్న భార్య లేదా తల్లిదండ్రులు సిలిండర్లు బుక్ చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ‘ఇండియన్ ఆయిల్ యాప్’ లేదా క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ ద్వారా మొబైల్ బయోమెట్రిక్ సదుపాయం తెచ్చినా, సాంకేతిక లోపాల వల్ల అది సక్రమంగా పనిచేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి.
మరోవైపు, గతంలో కనెక్షన్ పొంది ప్రస్తుతం మరణించిన కుటుంబ పెద్దల పేర్లపైనే గ్యాస్ వినియోగిస్తున్న కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చమురు మార్కెటింగ్ కంపెనీల నిబంధనల ప్రకారం కనెక్షన్ దారు మరణిస్తే వారి చట్టబద్ధ వారసుడి పేరిట కనెక్షన్ బదిలీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అవసరమైన ధ్రువపత్రాల సమర్పణ, ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి రావడం పేద కుటుంబాలకు భారంగా మారింది. ఇలాంటి నిబంధనలను సులభతరం చేసి, సరళమైన పద్ధతిలో వారసుల పేరు మీదకు బదిలీ చేసే ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని, ఆయిల్ కంపెనీలను డిమాండ్ చేస్తున్నారు.
Also Read : తోటి టీచర్ల కుట్రలకు బలయ్యా… ఖమ్మం టీచర్ గౌతమి రిజైన్!
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ-కేవైసీ నమోదుకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. వృద్ధులకు చేతి వేలిముద్రలు (Biometrics) పడకపోవడం, ఇంటర్నెట్ నెట్‌వర్క్ సమస్యలు, సిగ్నల్స్ లేకపోవడం,మొబైల్ ఫోన్ల వినియోగంపై అవగాహన రాహిత్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రక్రియను మందగించేలా చేస్తున్నాయి. వేలిముద్రలు పడని వృద్ధులు సంబంధిత ఆధార్ సెంటర్లకు వెళ్లి, ఐరిస్ (కంటిపాప) ద్వారా వివరాలను అప్‌డేట్ చేయించుకోవాల్సి వస్తోంది. పట్టణాల్లో అద్దెకు ఉండే బ్యాచిలర్లు, ఉద్యోగులు స్థానికంగా లభ్యం కాకపోవడం వల్ల ఏజెన్సీలకు చేరుకోలేకపోతున్నారు.
సమస్యల తీవ్రతను తగ్గించేందుకు చమురు సంస్థలు గ్యాస్ ఏజెన్సీలతో పాటు డెలివరీ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే ఈ-కేవైసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. సిలిండర్ సరఫరా చేసే డెలివరీ బాయ్స్ తమ వద్ద ఉన్న మొబైల్ స్కేనర్ ద్వారా ఆధార్ బయోమెట్రిక్ నమోదు చేస్తున్నారు. వినియోగదారులు తమ కనెక్షన్‌కు సంబంధించిన ఆధార్ కార్డ్, గ్యాస్ పాస్‌బుక్ వివరాలతో సమీప ఏజెన్సీని సంప్రదిస్తే నిమిషాల వ్యవధిలోనే ఉచితంగా ప్రక్రియ పూర్తవుతుంది. ఒకే కుటుంబంలో రేషన్ కార్డు లేదా ఆధార్ మ్యాపింగ్ ద్వారా రెండు కనెక్షన్లు ఉన్నవారి విషయంలో సబ్సిడీని ఎత్తివేస్తారా లేదా కమర్షియల్‌గా మారుస్తారా అనే దానిపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో అయోమయం కొనసాగుతోంది.
ఇటీవల అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు,యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంధన మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరా ఆలస్యమై, బుకింగ్‌కు-డెలివరీకి మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసలైన గృహ వినియోగదారులకే గ్యాస్ సరఫరా జరిగేలా చూడటంతో పాటు, కమర్షియల్ వినియోగానికి గృహ సిలిండర్లు మళ్లకుండా నిరోధించడమే ఈ-కేవైసీ ప్రధాన ఉద్దేశమని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం ఏజెన్సీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ-కేవైసీ పూర్తయిన వెంటనే బుకింగ్ సమస్యలు తొలిగిపోతాయని, వినియోగదారులు ఆందోళన చెందకుండా వెంటనే ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
మొత్తానికి, ఈ నెల 16వ తేదీని ఆఖరి గడువుగా ప్రకటిస్తూ పెట్రోలియం శాఖ, ఆయిల్ కంపెనీలు తుది హెచ్చరిక జారీ చేశాయి. ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా గడువు పెంపుపై లేదా ప్రత్యేక సడలింపులపై దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా లేదా ఏజెన్సీలను నేరుగా సంప్రదించి, నిర్దేశిత గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకొని సబ్సిడీ ప్రయోజనాలను కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో క్యాష్‌డెస్ట్ సేవలు బంద్!









