
Ponguleti : రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అయితే, ముందుగా ఏ ఎన్నికలు ఉంటాయనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. మీడియా చిట్‌చాట్‌లో భాగంగా రాష్ట్ర రాజకీయాలు, భూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రి పలు కీలక విషయాలను వెల్లడించారు. పార్టీలో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు లేవని, నేతల మధ్య సమన్వయం బాగానే ఉందని పొంగులేటి స్పష్టం చేశారు. కావాలనే కొందరు ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ల్యాండ్ రీ సర్వే ముమ్మరంగా జరుగుతోందని మంత్రి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు లబ్ధి కోసం ధరణి పాస్‌బుక్‌లలో వాస్తవ భూమి కంటే ఎక్కువ ఎకరాలు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ధరణిలో ఉన్న సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించి, క్లియర్ అయిన వాటికి త్వరలోనే భూ భారతి ద్వారా కొత్త పట్టాలు అందజేస్తామని చెప్పారు. అయితే కొన్ని వివాదాస్పద ఇష్యూలలో మాత్రం తప్పనిసరిగా కోర్టుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
భూమి ఎక్కడ ఉందో, సాగు చేసుకుంటున్న అసలు లబ్ధిదారులకే అక్కడే పొజిషన్ కల్పించే అవకాశం ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇక రాష్ట్రంలో సుమారు 80 వేలకు పైగా ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు ఉన్నాయని, గతంలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన పేదలు, రైతులు పూర్తిగా నష్టపోకుండా వారికి తగిన న్యాయం చేసేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న ధరణి భూములలో కొందరు పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు కట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా తగిన చర్యలు ఉంటాయన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నాణ్యత లోపంతో వర్షాలకు పూర్తిగా కురుస్తున్నాయని, ఆ ఇళ్లన్నింటినీ ప్రభుత్వం తరఫున త్వరలోనే రిపేర్ చేయిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. మరోవైపు, ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు పథకానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు. ఈ పథకం వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.









