Hyderabad Heavy Rain Alert : నగరంపై మరోసారి వర్షమేఘాలు కమ్ముకున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భాగ్యనగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులను నాంపల్లి సీపీ సజ్జనార్ అప్రమత్తం చేశారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. పనులపై బయటకు వెళ్లిన వారు కూడా వీలైనంత త్వరగా పనులు ముగించుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని ఆయన సూచించారు.

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచిపోయే ప్రధాన రహదారుల్లో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సీపీ స్పష్టం చేశారు. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. వర్షం పడే సమయంలో దృశ్యమాన్యత తక్కువగా ఉండటంతో పాటు రహదారులు జారే ప్రమాదం ఉన్నందున వాహనదారులు వేగం తగ్గించి, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని హెచ్చరించారు. వర్షం కారణంగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మందగించే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ముందస్తు ప్రణాళికతో వెళ్లాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పుల వల్ల తెలంగాణలోని దక్షిణ, తూర్పు, ఉత్తర, మధ్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావం వల్ల ఆదిలాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.

Also Read : ఎల్పీజీ వినియోగదారులకు ‘ఈ-కేవైసీ’ గండం…ఆ పని చేయకపోతే గ్యాస్ కనెక్షన్ కట్

ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాలు గత కొన్ని రోజులుగా నగరంలో వేధిస్తున్న తీవ్రమైన ఉక్కపోత నుంచి ప్రజలకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు నగరవాసులను కోరారు. అత్యవసర సహాయం కోసం నగరపాలక సంస్థ (GHMC), ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

మరోవైపు, ఈ రుతుపవనాల కాలంలో ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. జూన్ 1 నుంచి జూలై 31 నాటికి నగరంలో సాధారణంగా 282 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 237.4 మి.మీ మాత్రమే నమోదైంది. అంటే హైదరాబాద్‌లో ఏకంగా 16 శాతం వర్షపాత లోటు కనిపించింది. జూలై నెలాఖరు వరకు హైదరాబాద్‌, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, మేడ్చల్‌ జిల్లాలో ఏకంగా 37 శాతం లోటు (277.1 మి.మీ కి గానూ 175.7 మి.మీ మాత్రమే) రికార్డైంది. రంగారెడ్డి జిల్లాలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదవ్వడం కొంత ఊరటనిచ్చింది.

తగినంత వర్షం పడకపోవడమే కాకుండా, కురిసిన కొద్దిపాటి వర్షాలు కూడా కేవలం 18 నుంచి 21 రోజుల వ్యవధిలోనే పరిమితమయ్యాయి. దీనివల్ల భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరగలేదు సరేకదా, బోరుబావులు కూడా సరిగ్గా రీఛార్జ్ కాలేదు. గత వేసవితో పోలిస్తే ఈ వర్షాలు వాతావరణాన్ని చల్లబర్చేందుకు తోడ్పడినప్పటికీ, తాగునీటి, భూగర్భ జలాల వనరులు పుంజుకోవడానికి రాబోయే రోజుల్లో మరిన్ని ఊరటనిచ్చే వర్షాలు కురవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read : కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో క్యాష్‌డెస్ట్ సేవలు బంద్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.