Signature Forgery :  రాష్ట్రంలోని కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఫైర్ ఎన్‌ఓసీ కోసం తప్పుడు మార్గంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, పర్మిషన్లు పొందడం కలకలం రేపుతోంది. అలాంటి కాలేజీల ఫేక్ ఫైర్ ఎన్‌ఓసీలను గుర్తించిన హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకు దాదాపు 52 కళాశాలల గుర్తింపు రద్దు చేసేందుకు విద్యాశాఖ అధికారులు రెడీ అవుతున్నారు. ఈ మేరకు బుధవారం హైడ్రా ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 142 జూనియర్ కళాశాలలు ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించగా, అందులో 90 వరకు ఒరిజినల్ ఉన్నవి. 52 ధ్రువపత్రాలు నకిలీవని అధికారులు గుర్తించారు.

మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు మొత్తం 76 ఫైర్ ఎన్‌ఓసీలను వెరిఫికేషన్ కోసం పంపించారు. వాటిని హైడ్రా కార్యాలయ రికార్డులతో పరిశీలించగా, 7 ఫైర్ ఎన్‌ఓసీలు ఫోర్జరీ అని తేలింది. రెండో దశలో సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు మొత్తం 66 ఫైర్ ఎన్‌ఓసీలను ధ్రువీకరణ కోసం పంపించారు. వీటిని కూడా హైడ్రా కార్యాలయ రికార్డులతో పరిశీలించగా, 45 ఫైర్ ఎన్‌ఓసీలు నకిలీవని తేలింది. ఈ మేరకు ఆయా కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా అధికారులు సూచించారు. అంతేకాకుండా ఈ నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై తదుపరి చర్యల కోసం జూలై 4న నెక్లెస్ రోడ్డులోని లేక్ పోలీస్ స్టేషన్‌లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు.

పోర్జరీ ఫైర్ ఎన్‌ఓసీల వెనుక ఉన్న ముఠా గుట్టు రట్టు చేసే పనిలో పోలీసులు ఉన్నారు.. ఈ పరిణామాల నేపథ్యంలో 2025–26, 2026–27 విద్యా సంవత్సరాలకు సంబంధించి జూనియర్ కళాశాలల యాజమాన్యాలు సమర్పించిన ఫైర్ ఎన్‌ఓసీలన్నింటినీ హైడ్రా అధికారులు పరిశీలిస్తున్నారు. హైడ్రా అధికారుల సూచనల మేరకు ఫేక్ ఫైర్ ఎన్‌ఓసీలు అందజేసిన 52 కాలేజీల గుర్తింపు రద్దు చేసే ఆలోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలాన్ని ఒడిచిపట్టిన గళం “గద్దర్”

రంగనాథ్‌, నాగిరెడ్డి సంతకాల ఫోర్జరీ

అందులో దాదాపు దాదాపు ఎనిమిది ప్రైవేటు కాలేజీలు.. ఏకంగా రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ ఆయా కాలేజీలు నకిలీ ఫైర్ ఎన్‌వోసీలను(NOC) సృష్టించినట్లు తేలింది. కాగా హైడ్రా అధికారుల ఆ కళాశాలల వివరాలను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించారు. రంగనాథ్‌తో పాటు, మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాలను కూడా ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. నాగిరెడ్డి సంతకాలతో పలు కళాశాలలు NOC పత్రాలు సృష్టించినట్లు తేలింది. అయితే నాగిరెడ్డి స్థానంలో కొత్త ఫైర్ డీజీ రావడంతో ఈ వ్యవహారం బయటపడినట్లు తెలిసింది. నాగిరెడ్డి లేకపోయినప్పటికీ ఆయన పేరుతో సంతకాలు రావడంతో అధికారులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టక ఈ ఫోర్జరీ సంతకాలు, నకిలీ ఎన్‌వోసీల విషయం బయటపడినట్లు తేలింది.

Also Read : గిగ్‌ వర్కర్లకు గుడ్‌న్యూస్‌… సామాజిక భద్రతకు కొత్తచట్టం

ఆ కాలేజీలు ఇవే…

నకిలీ ఎన్‌వోసీలు ఇచ్చిన8 కాలేజీల వివరాలు ఇలా ఉన్నాయి. కెరీర్ పాయింట్ జూనియర్ కాలేజీ – పేట్ బషీరాబాద్‌, కైట్స్ జూనియర్ కాలేజీ – ఓల్డ్ బోయిన్‌పల్లి, విజ్ఞాన్ భారతి జూనియర్ కాలేజీ – యాప్రాల్‌, ఎక్స్‌లెన్సియా జూనియర్ కాలేజీ-దమ్మాయిగూడ, శ్రీ అభ్యాస్ జూనియర్ కాలేజీ – అల్వాల్, శ్రీ నారాయణ కాలేజ్ ఆఫ్ కామర్స్ – ఉప్పల్, సీఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజీ-ఈసీఐఎల్,ఎక్స్‌లెన్సియా జూనియర్ కాలేజీ-పేట్ బషీరాబాద్ లు ఉన్నాయి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.