
Special Police Officer : పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మాజీ సైనికులకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో ఎస్పీవో పోస్టులను భర్తీ చేయనుంది. సిటీలో ఖాళీగా ఉన్న 150 ప్రత్యేక పోలీసు అధికారులు (SPOs) పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే దీనికి మాజీ సైనికులు, మాజీ పారామిలటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది మాత్రమే అర్హులు. అవును వారినుంచే దరఖాస్తులను ఆహ్వానించారు. కాగా, మాజీ సైనికుల వయస్సు 31-08-2026 నాటికి 58 సంవత్సరాల లోపు ఉండాలి. మాజీ పారామిలటరీ, రిటైర్డ్ పోలీసు సిబ్బంది పదవీ విరమణ పొంది రెండు సంవత్సరాల లోపు అయి ఉండాలి. వీరికి గరిష్ట వయోపరిమితి 62 సంవత్సరాలుగా ఉంటుందని తెలిపారు.
ఈ ప్రత్యేక పోలీసులుగా ఎంపికైన వారికి నెలకు రూ.26,000 గౌరవ వేతనంగా చెల్లిస్తామని, ఇతర ఎలాంటి వేతనంతో కూడిన సెలవులు ఉండవని స్పష్టం చేశారు. అయితే అత్యవసర సమయంలో వేతనం చెల్లింపు లేకుండా సెలవులు మంజూరు చేస్తారని అధికారులు వెల్లడించారు.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలి. డిశ్చార్జ్ బుక్/డిశ్చార్జ్ సర్టిఫికేట్/రిటైర్మెంట్ ఆర్డర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎస్బీఐ పాస్‌బుక్ జిరాక్స్, ఓటరు గుర్తింపు కార్డు, కుల ధృవీకరణ పత్రం, టెక్నికల్ ట్రేడ్ ప్రొఫిషియన్సీ తదితర సర్టిఫికెట్ జతచేయాలి. డ్రైవర్ అభ్యర్థులకు చెల్లుబాటు అయ్యే LMV/HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తప్పనిసరి.
దరఖాస్తు కు- చివరి గడువు
కాగా ఈ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన పత్రాలతో హైదరాబాద్ పెట్లబుర్జ్లో ఉన్న CAR హెడ్‌క్వార్టర్స్‌లోని SPOs కార్యాలయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులను 25-08-2026 సాయంత్రం 5:00 గంటల లోపు సమర్పించాల్సి ఉంటుందని. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు తేల్చి చెప్పారు.









