
Erravelli Farmhouse Land : నిన్న మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న వివాదం చుట్టూ తిరిగిన తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా భూముల మీదకు మల్లాయి. సామాన్యుల భూములను 22ఏ లో పెట్టారని ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై ఫైర్ అయిన సీం రెవంత్ రెడ్డి ఒక్కసారిగా కేసీఆర్ ఫాంహౌజ్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల ప్రస్థావన తీసుకువచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన సామాన్య అమరులు, ఉద్యమకారులు సర్వస్వాన్నీ కోల్పోతే.. పదేళ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం, వారి బంధువులు వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములను కూడబెట్టారని రేవంత్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.ఊరికే రాజకీయ విమర్శలు చేయడం కాకుండా.. ఏకంగా 9 జిల్లాల్లోని 24 మండలాలు, 31 గ్రామాల్లో విస్తరించి ఉన్న మొత్తం 439.30 ఎకరాల భూముల సర్వే నంబర్ల లిస్ట్‌ను అసెంబ్లీ ముందు ఉంచారు.
Also Read : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి… ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల
అందులో ఎర్రవల్లి ఫాంహౌజ్ గురించిన అంశం ప్రత్యకంగా తెరమీదకు వచ్చింది. కేసీఆర్ ఆయన భార్య పేరున..సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి, మిట్టపల్లి, శివార్ వెంకటాపూర్‌లలో కలిపి 67.13 ఎకరాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అధికారిక రికార్డుల్లో ఉన్న 295 ఎకరాలు కాకుండా, ఎలాంటి రికార్డులు లేని ఈ 388 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా చుట్టూ కంచె వేసి కలిపేసుకుని దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో కేసీఆర్ సామ్రాజ్యాన్ని అనుభవిస్తున్నది పచ్చి నిజం కాదా? ఈ 700 ఎకరాల ఫామ్‌హౌస్ మీ భౌతిక ఆధీనంలో ఉన్నదా లేదా? దీనికి కేసీఆర్ సభకు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబం ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని ఇదంతా కొల్లగొట్టారని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని పూర్తి భూములపై సమగ్ర విచారణ జరిపి 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. గడువులోగా వివరాలు తేల్చకపోతే అధికారులపైనే చర్యలు ఉంటాయని గట్టి హెచ్చరికలు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్(KCR)కు సంబంధించిన భూముల వివరాలను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై రెవెన్యూ శాఖ కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి ఉన్నతాధికారులు మర్కుక్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రికార్డుల తనిఖీలు చేపట్టారు. 385 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారుల ఆరా తీశారు. శాటిలైట్ మ్యాప్‌లతో పరిశీలించారు. ఏడీ సుదర్శన్, ఆర్డీఓ చంద్రకళ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు.ఫామ్‌హౌస్‌కు కిలోమీటర్ దూరంలో భూముల సర్వే చేశారు.—గజ్వేల్ ఆర్డీఓ, మర్కుక్ ఎమ్మార్వో, ఏడీ సుదర్శన్ ఆధ్వర్యంలో పరిశీలన కొనసాగింది.ఎర్రవల్లి, వెంకటాపూర్ వరదరాజుపూర్ సరిహద్దుల్లోని సర్వే నంబర్ 325 పరిధిలో ఉన్న అసైన్డ్ భూములను అధికారులు శోధించి, పరిశీలించారు. ఇప్పటికే ఎర్రవల్లి, వెంకటపూర్ రెవెన్యూ గ్రామాల పరిధిలోని పలు కీలక సర్వే నంబర్లలో భూముల కొలతలు పరిశీలన ప్రక్రియ పూర్తిచేశారు. మార్కుక్ మండలం లోని ఎర్రవల్లి గ్రామంలో లోని పాండురంగ చెరువు సమీపంలో ఉన్న స్థలాలను పరిశీలించారు. ఏ సర్వే నంబర్లో ఎంత మేర భూమి విస్తరించి ఉంది, అందులో ప్రభుత్వ భూమి ఎంత, ప్రైవేట్ పట్టా భూమి ఎంత అనే కీలక వివరాలను సేకరించారు.భూములపై హక్కులు, ఆక్రమణల వివరాలను సేకరించిన అధికారులు తొలిరోజు తనిఖీలు పూర్తి చేశారు.రేపు మరోసారి పరిశీలించే అవకాశం ఉంది.మరోవైపు రెవెన్యూ అధికారులను స్థానిక రైతులు అడ్డుకున్నారు.సర్వే ఎందుకు చేస్తున్నారంటూ అధికారులపై ప్రశ్నలు సంధించారు.
సిద్దిపేటకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
కేసీఆర్ భూముల ఆక్రమణ అంశం వివాదస్పదం అయిన నేపథ్యంలో రేపు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సిద్ధిపేటకు వెళ్లనున్నారు.దీనికోసం రేపు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చింది.రేపు ఉదయం 10 గంటలకి అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చింది. వారు ప్రభుత్వ భూముల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.అనంతరం రెవెన్యూ అధికారులతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశం కానున్నారు.భూముల వివరాలు, రెవెన్యూ రికార్డులపై అధికారులతో చర్చిస్తారు.కేసీఆర్ భూములపై సీఎం రేవంత్ విచారణకు ఆదేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పర్యటనకు ప్రాధాన్యత చేకూరింది.
Also Read : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు ఆదేశం.. 30 రోజుల్లో తేల్చాలన్న సీఎం రేవంత్









